హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం (జనవరి 29) కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులపై దుర్భషలాడడం, విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
అసలేం జరిగిందంటే..?
గురువారం (జనవరి 29) కరీంనగర్ జిల్లా వీణ వంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటే పోలీస్లు తమను అడ్డుకున్నారని తన కుటుంబంతో కలిసి హుజరాబాద్లో రోడ్డుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల మీదకు దూసుకెళ్లి బెదిరించారు.
►ALSO READ | ఓకే.. టైమిస్తాం: కేసీఆర్ అభ్యర్థనపై సిట్ కీలక నిర్ణయం
‘భవిష్యత్తులో రేపు మీ కంటే పెద్ద పొజిషన్లో ఉంటా. మీ కంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది. నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు. నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కని సంగతి చూస్తా. వీణవంకలో సమ్మక్క పండగ చేసుకోకుండా అడ్డుకున్నారు’ అని సీఐకి వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్ సీపీ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే పోలీసులపై దుర్భషలాడడం, విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
