- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
జీడిమెట్ల, వెలుగు: చెరువుల అభివృద్ధి చర్యలను తాము స్వాగతిస్తున్నప్పటికీ అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం సహించబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం బాచుపల్లిలోని ప్రణీత్ అంటిలియా కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రేటర్ కమ్యూనిటీలోని గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా చర్యలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైడ్రా చర్యల వల్ల కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారం రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, వాటర్ లైన్లు కూడా సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రారంభంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తాము పూర్తి మద్దతు ఇచ్చామని తెలిపారు.
ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రణీత్ అంటిలియా కాలనీ వాసులకు కమిషనర్ రంగనాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఉమామహేశ్, స్వామి, దస్తగిరి, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
