కేసీఆర్ అసెంబ్లీకి రావాలి  : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి  : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

సంగారెడ్డి, వెలుగు: తెలంగాణ ప్రజల తరపున మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న.. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి కోరారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారన్నారు. ఆదివారం సాయంత్రం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు మంత్రి హాజరయ్యారు.

అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగారెడ్డి ఐబీలో మీడియాతో మాట్లాడుతూ ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో వైసీపీకి 11 సీట్లు వచ్చాయి.. వారికి ప్రతిపక్ష హోదా దక్కలేదన్నారు. కానీ తెలంగాణలో తాము బీఆర్ఎస్‌‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చామన్నారు. కేసీఆర్ ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.

అనంతరం నిర్వహించిన ఇఫ్తార్‌‌‌‌ విందులో మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు సంగారెడ్డి, సదాశివపేట ఐబీ గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని జగ్గారెడ్డి కోరగా.. ఒక్కో గెస్ట్ హౌజ్‌‌కు రూ.10 కోట్లు మంజూరు చేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. మీడియా సమావేశంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసి  చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.