అవగాహన లేకనో.. అమాయకత్వమో కానీ.. చిన్న పొరపాటు ఒకే కుటుంబంలో నలుగురి మృతికి కారణమైంది. ఇంకా కౌమార ప్రాయం కూడా దాటని పిల్లలతో పాటు.. 70 ఏళ్ల ఇంటి పెద్ద ప్రాణాలు తీసింది. రాత్రంతా పొగపీల్చి పడుకున్న వాళ్లు పడుకున్నట్లే నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన మురళి, రేవతి భార్యభర్తలు. ఆయనకు ఒక కుమారుడు కార్తీక్(15), ఇద్దరు ట్విన్స్ చందన (8), చరిత (8) ఉన్నారు. మురళి తండ్రి రామచంద్రయ్య (70) కూడా వారితో పాటు నివసిస్తున్నాడు.
శనివారం (మార్చి 14) మురళి తన ద్విచక్ర వాహనాన్ని బోర్ చేయించాడు. బైక్ ను రాత్రంతా ఆన్ లోనే ఉంచాలని మెకానిక్ చెప్పడంతో బండి ఆన్ చేసి పెట్టాడు. రాత్రి పిల్లలంతా తాతతో పాటే ఇంట్లో పడుకోగా.. మురళి, రేవతి ఇంటిపైన ఉన్న గదిలో పడుకున్నారు. బండిని ఆన్ లో ఉంచి ఇంటి గడియవేయడంతో సమయంలో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చుకుని ఇంట్లో పడుకున్న నలుగురు మృతి చెందారు. ఇంట్లో తాతతో పాటు కలిసి పడుకున్న మనవడు, ఇద్దరు మనవరాళ్లు చనిపోవటం పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంటి పెద్దను, పిల్లలను పోగొట్టుకున్న కన్నీరు మున్నీరవుతున్నారు.
