హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కొంత సమయం ఇవ్వాలన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థనకు సిట్ అంగీకరించింది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ రాసిన లేఖకు సిట్ రిప్లై ఇచ్చింది.
తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో 2026, జనవరి 30న విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం (జనవరి 29) హైదరాబాద్ నందీనగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి సిట్ అధికారులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం కేసీఆర్ వయస్సు రీత్యా ఆయన కోరుకున్న చోటే విచారణ చేస్తామని సిట్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ క్రమంలో సిట్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. జనవరి 30న విచారణకు హాజరుకాలేనని సిట్ అధికారులకు లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సిట్ బృందాన్ని కోరారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించిన గడువు ముగుస్తుండడంతో ఎన్నికల తర్వాత విచారించాలని కోరారు.
సిట్ విచారణకు హాజరయ్యేందుకు మరొక తేదీని ప్రకటించాలని లేఖలో తెలిపారు కేసీఆర్. తన అడ్రస్ ఫామ్ హౌస్‌కు మారింది కాబట్టి.. ఫామ్ హౌస్‌లోనే విచారించాలని సిట్‌ను కోరారు కేసీఆర్. బాధ్యత గల పౌరుడిగా సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఎర్రవల్లి ఫామ్ హౌస్ అడ్రస్‌కే పంపించాలని కోరారు. ఈ క్రమంలో కేసీఆర్ అభ్యర్థనకు అంగీకరించిన సిట్.. విచారణ హాజరయ్యేందుకు సమయం ఇచ్చేందుకు ఓకే చెప్పింది. విచారణకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని సిట్ స్పష్టం చేసింది.
