నెతన్యాహు బతికే ఉంటే..  వేటాడి చంపుతం: ఇజ్రాయెల్ ప్రధానికి ఐఆర్జీసీ వార్నింగ్

నెతన్యాహు బతికే ఉంటే..  వేటాడి చంపుతం: ఇజ్రాయెల్ ప్రధానికి ఐఆర్జీసీ వార్నింగ్

టెహ్రాన్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును "వెంబడించి చంపుతామని" ఇరాన్ ఆదివారం ప్రతిజ్ఞ చేసింది. నెతన్యాహు ఎక్కడ ఉన్నారనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. "పిల్లలను చంపే ఈ నేరస్తుడు ఒకవేళ బతికే ఉంటే.. మేం అతడిని పూర్తి శక్తితో వెంబడించి మరీ చంపుతాం" అని ఇస్లామిక్​రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.

నెతన్యాహు గత కొన్ని రోజులుగా బహిరంగంగా కనిపించకపోవడంతో యుద్ధంలో ఆయన గాయపడ్డారని, చనిపోయారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల12న విడుదల చేసిన ఒక వీడియోలో నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపిస్తోందని.. నెతన్యాహు చనిపోవడంతో ఏఐ వీడియో క్రియేట్ చేసి విడుదల చేసి ఉండొచ్చని ప్రచారం సాగింది.

నేను కాఫీ అంటే పడి చస్తున్నా..నెతన్యాహు జోకులు 

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ.. ఆదివారం ఆయన ఎక్స్‌‌‌‌ లో ఓ వీడియో విడుదల చేశారు. ఒక కేఫ్ లో కాఫీ ఆర్డర్ చేస్తూ.. ఈ వార్తలపై నెతన్యాహు తనదైన శైలిలో జోకులు వేశారు. "నేను కాఫీకి ఫిదా అయ్యాను (చచ్చిపోతున్నాను)" అని ఆయన హీబ్రూలో ఒక సామెతను వాడుతూ సరదాగా వ్యాఖ్యానించారు. వీడియోలో నెతన్యాహు తన రెండు చేతులను కెమెరా వైపు చూపిస్తూ.. "నా వేళ్లను లెక్కపెట్టాలనుకుంటున్నారా? చూడండి.. కనిపిస్తున్నాయా? చాలా బాగున్నాయి కదా" అని ఎద్దేవా చేశారు. 

ఇజ్రాయెల్ పౌరులకు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. "బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి, కానీ రక్షణ స్థలాలకు దగ్గరగా ఉండండి. మీ పట్టుదల అద్భుతం. అది నాకు, ప్రభుత్వానికి, ఐడీఎఫ్, మొసాద్ కు ఎంతో శక్తిని ఇస్తోంది. మేం చేస్తున్న కొన్ని పనులను నేను ఇప్పుడు వివరంగా చెప్పలేను కానీ.. ఈ రోజు కూడా ఇరాన్‌‌‌‌పై చాలా గట్టిగా దాడులు చేస్తున్నాం. వీలైనంత త్వరగా 
ఆంక్షలను సడలిస్తాం" అని ప్రజలకు తెలిపారు.