- నీచరాజకీయాల కోసం డ్రగ్స్ కేసులోకి నన్ను, బీఆర్‌ఎస్ పార్టీని లాగుతారా?.. లీగల్ నోటీసులిస్తా
- డ్రగ్స్ టెస్ట్ విషయంలో పీసీసీ చీఫ్ సూచనను స్వాగతిస్తున్నానని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: మనుషులను డ్రగ్స్ మహమ్మారి రాక్షసులుగా మారుస్తుందని, బాధ్యతగల పొజిషన్‌లో ఉన్నోళ్లు కూడా డ్రగ్స్ తీసుకోవడం దురదృష్టకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల వాడకానికి తాను తీవ్ర వ్యతిరేకమని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన ఘటనపై ఆదివారం కేటీఆర్ స్పందించారు.
డ్రగ్స్ వినియోగం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్ తీసుకునేవారిని, వాటిని సరఫరా చేసేవారిని ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. కానీ, నీచరాజకీయాల కోసం ఈ డ్రగ్స్ వ్యవహారంలోకి అనవసరంగా తనను, బీఆర్‌ఎస్ పార్టీని లాగడమేంటని ఆయన ప్రశ్నించారు.
ఎలాంటి డ్రగ్స్ టెస్టుకైనా తాను సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశానని చెప్పారు. తనను డ్రగ్స్ కేసులోకి లాగాలని చూస్తే చట్టపరంగా నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్ని రాజకీయపార్టీల నేతలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని తెలిపారు.
