మూత పడనున్న మరో జలసంధి.. అదే జరిగితే ప్రపంచం తలకిందులైనట్లే !

మూత పడనున్న మరో జలసంధి.. అదే జరిగితే ప్రపంచం తలకిందులైనట్లే !

ఇదైతే ప్రపంచానికి పిడుగు లాంటి వార్త అనే చెప్పాలి. ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూత పడటంతో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొతరతో ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి తరుణంలో మూలినే నక్క మీద తాటికాయ పడినట్లుగా మరో జలసంధి మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అదే జరిగితే.. ఇక ప్రపంచం తల్లకిందులైంది అంటారు కదా.. అలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా చాలా దేశాలు ఇంధన కొరతతో ఇబ్బందులకు గురవుతున్నాయి. అణ్వాయుధాల నియంత్రణ అంటూ అమెరికా ఇరాన్ ను టార్గెట్ చేస్తుండగా.. తమపై అమెరికా పెత్తనమేంటని ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. యుద్ధం మొదలై 16 రోజులు దాటినా.. ఏ ఒక్క దేశం తగ్గటం లేదు. పశ్చిమాసియాలో మిసైళ్లు, డ్రోన్లు, బాంబుల దాడితో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇలాంటి తరుణంలో యుద్ధంలోకి హౌతీస్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాక్. యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీస్ మిలిటెంట్ గ్రూప్.. అమెరికాకు వ్యతిరేకంగా ఆయుధాలను సానబెటుతున్నట్లు చెబుతున్నారు. ఇరాన్ సహాయ సహకారాలతో నడిచే ఈ గ్రూప్ యుద్ధంలోకి దిగటమే కాకుండా.. ప్రపంచ వాణిజ్యానికి మరో కీలక ఆధారమైన మరో జలసంధి.. బాబ్ ఎల్-మాందెబ్ (Bab el-Mandeb Strait) ను మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 

ట్రిగ్గర్ పైన మా వేళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఏ సమయంలో అయినా కదనరంగంలోకి దూకేందుకు రెడీ గా ఉన్నట్లు ఇప్పటికే మెసేజ్ పంపారు. అయితే దీన్ని ఇరాన్ మూడంచెల వ్యూహంలో భాగంగా విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఫార్స్ రిపోర్ట్ ప్రకారం.. హౌథీస్ తో పాటు ఇతర గ్రూప్స్ ఇరాన్ తో జట్టుకట్టున్నట్లు పేర్కొంది. అదే విధంగా జలసంధిని మూసివేసి అమెరికా తదితర దేశాల ఆట కట్టించాలనే ప్లాన్ ఉన్నట్లు వెల్లడించింది. 

బాబ్ ఎల్ మండేబ్ జలసంధి:

బాబ్ ఎల్ మండేబ్ జలసంధి.. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. ఎర్ర సముద్రం (రెడ్ సీ) నుంచి గల్ఫ్ ఆఫ్ అడెన్, హిందూ మహా సముద్రాన్ని కలుపుతుంది. యూరోప్, ఆసియా ఖండాల మధ్య సూయెజ్ కాలువ గుండా ప్రయాణించే నౌక ఏదైనా బాబ్ ఎల్ మండేబ్ నుంచి వెళ్లాల్సిందే. 

బాబ్ ఎల్ మండేబ్ మూసివేస్తే ఏమవుతుంది..?

ఒక వేళ బాబ్ ఎల్ మండేబ్ సంధిని మూసివేస్తే ప్రపంచ రవాణా మరింత క్లిషతరంగా మారుతుంది. సూయెజ్ కాలువ ద్వారా ఈ జలసంధిని దాటకుండా వెళ్లాలంటే నౌకలకు ఉన్న ఏకైక మార్గం కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good Hope). ఇది ఆఫ్రికా ద్వీపకల్పం దగ్గర ఉంటుంది. ఇలా వెళ్లాలంటే రవాణాకు 20 నుంచి25 రోజులు పడుతుంది. ఇక ఆసియా-యూరోప్ రవాణాకు 30 నుంచి 40 రోజులు పడుతుంది. అదనంగా 10 నుంచి 15 రోజులు పడుతుందని చెబుతున్నారు. 

ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం ఈ సంధిగుండా జరుగుతుంది. అదే విధంగా సముద్రం నుంచి వెలికితీసే క్రూడ్ ఆయిల్,  లాగే గ్యాస్ (LNG)  10 శాతం  ఈ కారిడార్ గుండానే రవాణా జరుగుతంది. 2023 లో ఒక రోజుకే 8.8 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్, గ్యాస్ రవాణా జరిగినట్లు అమెరికా ఇంధన శాఖ పేర్కొంది.  2014 లో సనాను టేక్ ఓవర్ చేసిన తర్వాత.. ఎర్రసముద్రం మీద ఆధిపత్యం హౌథీలదే ఉంది. 

ఒకవేళ బాబ్ ఎల్ మండేబ్ ను స్వాధీనం చేసుకోవడంలో హౌతీలు సక్సెస్ అయితే.. అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద విపత్తుగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే హార్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధన కొరతతో కొన్ని దేశాల్లో ప్రజలు వంటలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇక ఈ జలసంధి కూడా మూతపడితే మరింత సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.