హైదరాబాద్‌‌‌‌లో రూ.2 కోట్ల నగలు చోరీ

హైదరాబాద్‌‌‌‌లో రూ.2 కోట్ల నగలు చోరీ
  • 45 రోజుల కింద ఇంట్లో పనికి చేరిన నేపాలీ దంపతులు
  • కనిపించకపోవడంతో వారిపైనే పోలీసుల అనుమానం

జూబ్లీహిల్స్, వెలుగు: ఇంట్లోని లాకర్లలో దాచిన రూ.2 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీ చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని జూబ్లీహిల్స్‌‌‌‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్​నంబర్​25లోని ఫ్లాట్​నంబర్​305లో వ్యాపారవేత్త అనిరుధ్​రెడ్డి, దీపికా రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. 45 రోజుల కింద నేపాలీ వ్యక్తులు మహేశ్​షాహి, అప్సర షాహి దంపతులను ఇంటి పనుల కోసం నియమించుకున్నారు. వారం రోజుల కింద అనిరుధ్ రెడ్డి వ్యాపార పనుల మీద తమిళనాడులోని ఊటీకి వెళ్లగా.. గత శుక్రవారం దీపికా రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు.

శనివారం ఉదయం మహేశ్​షాహి, అప్సర షాహి కనిపించకపోవడంతో పక్కింటివారు అనిరుధ్ రెడ్డికి ఫోన్​చేసి చెప్పారు. ఆయన వెంటనే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 29లో నివసిస్తున్న తన స్నేహితుడు రోహిత్ మెహతాకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. తన ఫ్లాట్​కు వెళ్లాలని కోరారు. రోహిత్ మెహతా వెళ్లి చూడగా.. లోపల లాకర్లు పగిలిపోయి కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌‌‌‌కు చేరుకొని పరిశీలించారు.

అనిరుధ్​రెడ్డిని ఫోన్​లో ఆరా తీయగా.. లాకర్లలో రూ.2 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉంచామని తెలిపారు. అవి మాయమవడం, అదే సమయంలో ఇంట్లో పని చేసే మహేశ్ షాహి, అప్సర షాహి కనిపించకపోవడంతో పోలీసులు వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ మెహతా ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్ని వెల్లడించారు.