ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక : వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశుధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు

 ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక : వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పారిశుధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు

జనగామ/ ములుగు/ ములకలపల్లి/ రేగొండ/ వైరా, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పారిశుధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పలుచోట్ల పారిశుధ్య కార్మికులను సన్మానించారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో మొత్తం 1986 మంది కార్మికులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆస్పత్రికి రెఫర్​ చేసినట్లు డీఎంహెచ్​వో మల్లికార్జున్​రావు తెలిపారు.

 ములుగు జిల్లా మల్లంపల్లిలో పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ కలెక్టర్​ దివాకర వారిని సన్మానించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు, అంగన్​వాడీ కేంద్రాలను పరిశీలించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన జీపీ ఆఫీస్, ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. 

అనంతరం ములకలపల్లి జీపీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి, యూనిఫామ్స్​ అందజేసి సత్కరించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులకు మున్సిపల్​ చైర్​పర్సన్​ కాపా చంద్రకళ, వైస్​ చైర్మన్​ సంతోష్​ పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.