ఉద్యోగులకు డీఏ క్లియరెన్స్‌‌‌‌.. షెడ్యూల్ రిలీజ్ కు నిమిషాల ముందు బెంగాల్ సీఎం మమత ప్రకటన

ఉద్యోగులకు డీఏ క్లియరెన్స్‌‌‌‌.. షెడ్యూల్ రిలీజ్ కు నిమిషాల ముందు బెంగాల్ సీఎం మమత ప్రకటన

కోల్‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌ ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ రిలీజ్‌‌‌‌కు కొన్నినిమిషాల ముందు సీఎం మమతా బెనర్జీ రెండు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల  డీఏ క్లియరెన్స్‌‌‌‌ చేస్తున్నట్టు ‘ఎక్స్‌‌‌‌’ వేదికగా ఆదివారం అనౌన్స్​ చేశారు. పూజారులు, ముస్లిం ముఅజ్జిన్‌‌‌‌ల నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు వెల్లడించారు. 2009 నుంచి డీఏ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తున్నట్టు తెలిపారు. ‘‘ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లలో వివరించిన ప్రకారం.. ఉద్యోగులు మార్చి 2026 నుంచి తమ ఆర్‌‌‌‌‌‌‌‌వోపీఏ 2009 డీఏ బకాయిలను అందుకుంటారు’’ అని మమత పేర్కొన్నారు. 

అలాగే, హిందూ పురోహితులు, ముస్లిం ముఅజ్జిన్‌‌‌‌ల నెలవారీ గౌరవ వేతనాన్ని మరో రూ.500 చొప్పున పెంచుతున్నట్టు వెల్లడించారు. పురోహితులు, ముఅజ్జిన్‌‌‌‌ల గౌరవ వేతనాలను పెంచే ఆదేశాన్ని ఇచ్చినందుకు తనకు సంతోషంగా ఉందని మమత వెల్లడించారు. అలాగే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరి అప్లికేషన్లను కూడా ప్రభుత్వం ఆమోదించినట్టు  తెలిపారు. కాగా, ఎలక్షన్‌‌‌‌ షెడ్యూల్​ రిలీజ్‌‌‌‌కు కొన్ని నిమిషాల ముందే మమతా బెనర్జీ చేసిన ప్రకటనలపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. 

దీనిని ఒక ‘ఎన్నికల డ్రామా’ అని అభివర్ణించింది. మరోవైపు, మమత ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ‘సంగ్రామి జౌతా మంచా’ నాయకుడు భాస్కర్ ఘోష్ మాట్లాడుతూ.. ఇది తమ పోరాట ఫలితమేనన్నారు. కాగా, షెడ్యూల్ వెలువడటానికి ముందు బెంగాల్‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన గౌరవ వేతనం పెంపు, డీఏ బకాయిల క్లియెరెన్స్.. తదితర నిర్ణయాలు కోడ్ ఉల్లంఘన కిందకు రావని ఈసీ స్పష్టం చేసింది.