తాగునీళ్లు ఫుల్లు.. కష్టాలకు చెల్లు... హైదరాబాద్ లో నీటి సరఫరాకు ఢోకా లేదంటున్న వాటర్బోర్డు

తాగునీళ్లు ఫుల్లు.. కష్టాలకు చెల్లు... హైదరాబాద్ లో నీటి సరఫరాకు ఢోకా లేదంటున్న వాటర్బోర్డు
  •  నాగార్జునసాగర్​లో గత ఏడాది కంటే ఎక్కువ నిల్వలు
  • గతంలో 520 అడుగులు..ఇప్పుడు 537  
  • మిగతా ప్రాజెక్టుల్లోనూ ఆశాజనకంగానే నీళ్లు 

హైదరాబాద్​సిటీ,వెలుగు : హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీరుస్తున్న నాగార్జున సాగర్​లో ఈసారి నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండడంతో వాటర్​బోర్డు అధికారులు రిలీఫ్​గా ఫీలవుతున్నారు. సాగర్​పూర్తి కెపాసిటీ 590 అడుగులు కాగా గత ఏడాది మార్చి నాటికే 520 అడుగులకు పడిపోయింది. దీంతో మే నాటికి డెడ్​స్టోరేజీ 509 అడుగుల నుంచి నీటిని పంపింగ్​చేయాల్సి వచ్చింది.

కానీ భారీ వర్షాలతో ఈసారి గత ఏడాది కంటే నీటి నిల్వలు ఎక్కువే ఉన్నాయి. 537 అడుగుల మేర నీళ్లు ఉండడంతో ఈ వేసవిలో నీటి కష్టాలు ఉండవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి మే నాటికే సాగర్​డెడ్​స్టోరేజీకి చేరేదని, దీంతో పంపింగ్​చేసి నీటిని తోడేవాళ్లమని, ఈసారి ఆ పరిస్థితి రాకపోవడం శుభపరిణామమంటున్నారు. 

275 ఎంజీడీలు సాగర్​ నుంచే..

ఎండాకాలం కాకుండా మిగతా కాలాల్లో 584 ఎంజీడీల నీటిని వాటర్​బోర్డు సరఫరా చేస్తోంది. ఈ నీళ్లు కూడా నగరానికి సరిపోవడం లేదు. వాస్తవానికి ఈ కాలాల్లో 650 ఎంజీడీలు అవసరం ఉంటుంది. దీంతో సిటీకి కావాల్సిన నీళ్ల కోసం 275 ఎంజీడీలు నాగార్జున సాగర్​నుంచి, గోదావరి ఫస్ట్​ఫేజ్​ద్వారా ఎల్లంపల్లి నుంచి 165 ఎంజీడీలు, సింగూరు నుంచి 70 ఎంజీడీలు, మంజీరా నుంచి 40 ఎంజీడీలు, ఉస్మాన్​సాగర్​నుంచి 23 ఎంజీడీలు, హిమాయత్​సాగర్​నుంచి11 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు.  

ఎండాకాలం డిమాండ్​ఎక్కువగా ఉంటుంది కాబట్టి 700 ఎంజీడీలు అసరం ఉంటుంది. గ్రేటర్​లో కొత్తగా చేరిన ప్రాంతాలతో మరో 25 ఎంజీడీల అవసరం ఏర్పడింది. దీంతో ప్రతిచోటా కొంచం ఎక్కువ నీటిని డ్రా చేస్తూ 650 ఎంజీడీలను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్​లో ఉన్న నిల్వలతో ఈ కొరత కొంత తీరుతుందంటున్నారు.

ఇతర జలాశయాల్లోనూ భారీ నిల్వలు

గ్రేటర్ కు  ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఇతర జలాశయాల్లోనూ నీటి నిల్వలు గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎక్కువే ఉన్నాయి. ఎల్లంపల్లిలో గత సంవత్సరం 474. 824 అడుగులు ఉంటే ఇప్పుడు 477.582 అడుగులు, మంజీరాలో గతంలో 1648 అడుగులు ఉంటే ఈసారి 1650, ఉస్మాన్​సాగర్​లోనూ గత ఏడాది 1786, ఇప్పుడు 1788 , హిమాయత్​ సార్​లో గతేడాది 1760, ఇప్పుడు 1762 అడుగులు ఉంది. దీంతో  ఈ సంవత్సరం జూన్​వరకూ గ్రేటర్​కు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని వాటర్​బోర్డు అధికారులు భరోసా ఇస్తున్నారు. 

 510 అడుగులు మెయింటెయిన్​ చేయండి

హైదరాబాద్​నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగర్​లో 510 అడుగుల వరకు నీటి మట్టాన్ని మెయింటెయిన్ చేయాలని, వ్యవసాయ, ఇతర అవసరాలను చూపి నీటి మట్టం తగ్గించవద్దని వాటర్​బోర్డు ఇరిగేషన్​ శాఖ కు లెటర్​రాసింది. ఎందుకంటే నాగార్జున సాగర్​నుంచి వ్యవసాయానికి ఇరిగేషన్​అధికారులు నెలకు దాదాపు 60 టీఎంసీల వరకూ సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం సాగర్​లో 183 టీఎంసీల నీళ్లు ఉండడంతో 171కి తగ్గకూడదు..అందుకే వాటర్​బోర్డ్​ఇరిగేషన్​అధికారులకు లెటర్​రాసింది.