న్యూజిలాండ్ తో చివరి టీ20 పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య ఐదో టీ20 శనివారం (జనవరి 31) జరుగుతుంది. తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నాలుగో టీ20 ఓడిపోయినా చివరి టీ20లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా చివరి మ్యాచ్ లో విజయం సాధించి ఘనంగా ముగించాలని భావిస్తుంది. మరోవైపు నాలుగో టీ20లో గెలిచి కాన్ఫిడెంట్ గా ఉన్న కివీస్ ఐదో టీ20లోనూ గెలిచి టీమిండియా ఆధిక్యాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తుంది.
ఈ మ్యాచ్ లో ఇండియా రెండు మార్పులతో బరిలోకిదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో టీ20 మ్యాచ్ లో గాయంతో మ్యాచ్ కు దూరమైన ఇషాన్ కిషాన్ పూర్తిగా కోలుకొని ఐదో టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాడు. తొలి టీ20లో 8 పరుగులే చేసి విఫలమైనా రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 32 బాల్స్‌లోనే 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆదివారం (జనవరి 25) జరిగిన మూడో టీ20లోనూ 12 బంతుల్లోనే 28 పరుగులు చేయి జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సిద్ధంగా ఉన్నాడు.
కిషాన్ జట్టులోకి వస్తే అర్షదీప్ సింగ్ లేదా జస్ప్రీత్ బుమ్రాలలో ఒకరికి రెస్ట్ ఇవ్వొచ్చు. తొలి టీ20 తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ టీమిండియా ప్లేయింగ్ 11లోకి రానున్నాడు. అక్షర్ ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించినట్టు తెలుస్తుంది. నాలుగో టీ20 ముందు అక్షర్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అక్షర్ జట్టులోకి వస్తే హర్షిత్ రానాపై వేటు పడొచ్చు. వరుసగా నాలుగు టీ20లు ఆడిన హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో అక్షర్ జట్టులోకి వస్తే రానాప్ ప్లేయింగ్ 11 లో ఉంటాడు.
అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ మూడో స్థానంలో ఆడతాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీంతో శివమ్ దూబే ఐదో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆరో స్థానంలో రింకూ సింగ్.. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయనున్నారు. ఎనిమిదో స్థానంలో హర్షిత్ రానాకి ఛాన్స్ దక్కొచ్చు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూజిలాండ్ తో ఐదో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
