బ్రిటన్ వాహనదారులకు భారీ ఊరట లభించింది. పెట్రోల్ ధరలు గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం యూకేలో లీటర్ పెట్రోల్ ధర సగటున 131.91 పెన్నీలు అంటే సుమారు రూ.140.64కి చేరుకుంది. 2021 జూలై తర్వాత పెట్రోల్ ఇంత తక్కువ ధరకు అమ్మటం ఇదే తొలిసారి అని అక్కడి వాహనదారుల సంఘం 'ఆర్ఏసీ' వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వెల్లడైంది.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల సగటు వాహనదారుడి బడ్జెట్‌పై సానుకూల ప్రభావం చూపుతోంది. డిసెంబర్ ప్రారంభం నుంచి పెట్రోల్ ధర లీటరుకు 5 పెన్నీల కంటే ఎక్కువగా తగ్గింది. దీనివల్ల ఒక సగటు 55 -లీటర్ల ఫ్యామిలీ కారును ఫుల్ ట్యాంక్ చేయించుకున్న ప్రతిసారీ వాహనదారుడికి దాదాపు 3 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.375 ఆదా అవుతోంది. ఒకవేళ నెలకు ఒక కారు యజమాని నాలుగు సార్లు ట్యాంక్ ఫుల్ చేయిస్తే.. నెలకు దాదాపు రూ.15 వందల వరకు ఆదా చేసుకునే అవకాశం దొరికింది. ఇక డీజిల్ ధరలు కూడా జనవరి నుంచి లీటరుకు 3 పెన్నీలు తగ్గి 140.97 పెన్నీల అంటే సుమారు రూ.150.31 వద్ద కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు జనవరి 7న బ్యారెల్‌కు 60 డాలర్ల కంటే కిందకు పడిపోవడంతో యూకేలో పెట్రోల్, డీజిల్ రిటైల్ రేట్లు భారీగా తగ్గాయి. 2021 ఫిబ్రవరి తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి తగ్గడం ఇదే మొదటిసారి. అయితే ఆయిల్ కంపెనీలు హోల్‌సేల్ మార్కెట్‌లో పొందుతున్న లాభాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయడం లేదని ఆర్ఏసీ విమర్శిస్తోంది. ఒకవేళ ఆ లాభాలను కూడా అందించి ఉంటే జనవరిలో ధరలు ఇంకా తగ్గి ఉండేవని అంటున్నారు. బ్రిటన్ కాంపిటిషన్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ కూడా ఇంధన చిల్లర వ్యాపారుల లాభాల మార్జిన్లు పెరిగాయని, మార్కెట్‌లో సరైన పోటీ లేకపోవడం వల్ల ధరలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదని గతంలోనే స్పష్టం చేసింది.
ALSO READ : మేం చేస్తోండి గాడిద చాకిరీ.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ ఆవేదన.. 16 గంటలు పనిచేస్తే మిగిలేది ఎంతంటే..?
మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల వల్ల యూకేలో ఇంధన ధరలు దిగిరావడం అక్కడి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌కు పెద్ద ఊరటనిస్తోంది. భారతదేశంలో కూడా మోడీ ప్రభుత్వం తగ్గిన అంతర్జాతీయ చమురు రేట్లలోని ఊరటను ప్రతి భారతీయుడికి అందేలా చూడాలనే డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది ఇండియాలో కూడా ఇలా రేట్లు తగ్గించాలని సామాజిక మాధ్యమాల్లో కోరుతున్నారు. యూకేలోని ఈ ఇంధన ధరల ప్రభావం అక్కడి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణం తగ్గించటానికి దోహదపడవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
