గూగుల్‌కే గుబులు పుట్టిస్తున్న AI.. భారత్‌ లాభాల్లో నో గ్రోత్..!

గూగుల్‌కే గుబులు పుట్టిస్తున్న AI.. భారత్‌ లాభాల్లో నో గ్రోత్..!

టెక్ దిగ్గజం గూగుల్‌కు భారత మార్కెట్‌లో గడ్డు కాలం ఎదురవుతోందా? లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ 'టొఫ్లర్' వెల్లడించిన లెక్కల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో గూగుల్ ఇండియా ఆదాయం తగ్గడమే కాకుండా, నికర లాభం కూడా దాదాపు ఫ్లాట్‌గా ఉండిపోయింది. కంపెనీ నిర్వహణ ఆదాయం 3.2 శాతం తగ్గి రూ.5వేల 340 కోట్లకు చేరుకోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఏడాది రూ.వెయ్యి 425 కోట్లుగా ఉన్న లాభం.. ఈ ఏడాది స్వల్పంగా పెరిగి రూ.వెయ్యి 436.9 కోట్లకు మాత్రమే పరిమితమైంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI విప్లవం కొనసాగుతోంది. గూగుల్ తన సెర్చ్ ఇంజిన్, ఇతర సేవల్లో ఏఐని అమితంగా నమ్ముకున్న తరుణంలో, ఆదాయం తగ్గడం వెనుక ఏఐ పెట్టుబడుల ప్రభావం ఉందా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయడం, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడం గూగుల్‌కు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. తాజా రిపోర్ట్ ప్రకారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం చేసే ఖర్చు 7.8 శాతం పెరిగి రూ.2వేల 146 కోట్లకు చేరుకుంది. అంటే కంపెనీకి వచ్చే ఆదాయంలో మెజారిటీ భాగం జీతాలు, ఇతర వ్యయాలకే పోతోంది.

ఆదాయం తగ్గడానికి మరో కారణం యాడ్స్ రంగంలో పెరుగుతున్న పోటీ కూడా. ఒకప్పుడు గూగుల్ సెర్చ్ మాత్రమే సమాచారానికి ఏకైక మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు గూగుల్ ఆధిపత్యానికి గండి కొడుతున్నాయి. వినియోగదారులు నేరుగా ఏఐ ద్వారా సమాధానాలు పొందుతుండటంతో.. గూగుల్ యాడ్స్ రెవెన్యూపై ప్రభావం స్టార్ట్ అయ్యింది. దీనికి తోడు కంపెనీ పన్నుల భారం కూడా 22.6 శాతం పెరిగి రూ.543 కోట్లకు చేరడం లాభాల పెరుగుదలకు అడ్డంకిలా మారింది.

ALSO READ : బ్రిటన్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్.. నెలకు రూ.15వందలు సేవింగ్స్..

మొత్తానికి గూగుల్ ఇండియా మొత్తం ఆదాయంరూ.6వేల 116 కోట్లుగా ఉన్నప్పటికీ.. నెట్ మార్జిన్ మాత్రం 24.06 శాతం నుంచి 23.49 శాతానికి పడిపోయింది. భారత్ వంటి అతిపెద్ద మార్కెట్‌లో గూగుల్ తన పట్టును నిలుపుకోవాలంటే, ఏఐ సవాళ్లను అధిగమిస్తూ కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక గణాంకాలు అలర్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు తిరుగులేని వృద్ధిని కనబరిచిన గూగుల్, ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని ఇది నిరూపిస్తోంది.