T20 World Cup 2026: అభిషేక్, హెడ్, బట్లర్ కాదు.. అతడే వరల్డ్ కప్ టాప్ స్కోరర్: స్టెయిన్ జోస్యం

T20 World Cup 2026: అభిషేక్, హెడ్, బట్లర్ కాదు.. అతడే వరల్డ్ కప్ టాప్ స్కోరర్: స్టెయిన్ జోస్యం

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు 10 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ ఈ మెగా టోర్నీ కోసం ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. టోర్నీకి ముందు సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ డేల్ స్టెయిన్ 2026 టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు ఎవరు చేస్తారో అంచనా వేశాడు. 

2026 ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిని అంచనా వేయమని ఒక యూజర్ స్టెయిన్‌ను అడిగినప్పుడు.. తన దేశానికే  క్వింటన్ డి కాక్ పేరు చెప్పుకొచ్చాడు. 2025 అక్టోబర్ లో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన డికాక్ అద్భుతంగా రాణించాడు. గత ఏడాది చివర్లో ఇండియాతో జరిగిన టీ20 సిరీస్ లో దుమ్ములేపాడు. చండీఘర్ వేదికగా జరిగిన రెండో టీ20లో కేవలం 46 బంతుల్లో 90 పరుగులు చేసి తన మార్క్ చూపించాడు. ఇదే సిరీస్ లో చివరి మ్యాచ్ లో 35 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇదే సూపర్ ఫామ్ ను డికాక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో చూపించాడు. 12 మ్యాచ్ ల్లో 390 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

Also Read : ఫుట్ వర్క్ లేకుండా వికెట్లు వదిలేసి నిలబడతావా

తొలిసారి 20 జట్లతో టీ20 వరల్డ్ కప్: 

క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. 

భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.