ఐపీఎస్ అధికారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఐపీఎస్ అధికారుల సంఘం . మతం పేరుతో ఆరోపణలు చేయడం అత్యంత హేయనీయమని.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిరాధారమైనవని ఖండించింది. కరీంనగర్ సీపీకి ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై చేసిన మత మార్పిడుల ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.
ఎమ్మెల్యే ప్రవర్తనపై తక్షణ విచారణకు డిమాండ్ చేసిన IPS అధికారుల సంఘం.. ఎమ్మెల్యే నుంచి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి మతమార్పిడికి ప్రయత్నిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ, అతని మతం గురించి చేసిన చౌకబారు ఆరోపణలతో తీవ్రంగా కలత చెందామని తెలిపింది. ఈ సంఘటనను పౌర సేవల నైతికత, గౌరవంపై తీవ్రమైన దాడిగా భావిస్తున్నామని..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది ఐపీఎస్ అధికారుల సంఘం.
గురువారం (జనవరి 29) కరీంనగర్ జిల్లా వీణ వంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటే పోలీస్లు తమను అడ్డుకున్నారని తన కుటుంబంతో కలిసి హుజరాబాద్లో రోడ్డుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల మీదకు దూసుకెళ్లి బెదిరించారు.
‘భవిష్యత్తులో రేపు మీ కంటే పెద్ద పొజిషన్లో ఉంటా. మీ కంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది. నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు. నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కని సంగతి చూస్తా. వీణవంకలో సమ్మక్క పండగ చేసుకోకుండా అడ్డుకున్నారు’ అని సీఐకి వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్ సీపీ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే పోలీసులపై దుర్భషలాడడం, విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
