కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (20)ను కట్నం కోసం భర్త హరిబాబు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం కోరుట్ల పీఎస్‌లో డీఎస్పీ రాములు కేసు వివరాలు వెల్లడించారు. వైష్ణవి కొంతకాలంగా యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది.
.10 నెలల క్రితం హరిబాబుతో పరిచయం ప్రేమగా మారి, 2025 మే 29న వెంకటాపూర్ శివారులోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. మొదట రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ, మరో రూ.5 లక్షలు తేవాలని హరిబాబు తరచూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు అతని తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్ సహకరించారు. నాలుగు నెలల గర్భిణిగా ఉన్నా వైష్ణవిపై కూడా వేధింపులు కొనసాగాయి.
సోమవారం అర్ధరాత్రి సమయంలో గదిలో గొడవ జరిగి, హరిబాబు కత్తితో దాడి చేశాడు. ఉదయం అతడు పరారవ్వగా, గదిలో రక్తపు మడుగులో ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పరారీలో ఉన్న హరిబాబును కోనరావుపేట ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు.
హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రేరేపించిన నిందితుడి కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ రాములు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సురేశ్‌బాబు, ఎస్ఐ చిరంజీవి పాల్గొన్నారు.
