తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల' నిరీక్షణకు తెరపడింది. గత కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రకటన పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు 2016 నుండి 2022 వరకు వివిధ సంవత్సరాలకు సంబంధించిన విజేతల జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో కోలీవుడ్ వర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ సుదీర్ఘ జాబితాలో మహానటి కీర్తి సురేష్ తనదైన ముద్ర వేసింది.
ఉత్తమ నటిగా కీర్తి సురేష్
జాతీయ ఉత్తమ నటిగా ఇప్పటికే తన సత్తా చాటిన కీర్తి సురేష్.. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ పురస్కారాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. 2017లో విడుదలైన 'పాంబు సట్టై' (Paambu Sattai) చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు గానూ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆడమ్ దాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో 'వేణి' అనే మధ్యతరగతి యువతి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, భావోద్వేగాలను పండించడంలోనూ తాను మేటి అని ఈ సినిమాతో నిరూపించుకుంది.
మెరిసిన స్టార్ హీరోలు..
ఈ అవార్డుల ప్రకటనలో కేవలం కీర్తి సురేష్ మాత్రమే కాదు.. కోలీవుడ్ దిగ్గజాలందరికీ చోటు దక్కింది. విక్రమ్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, కార్తీ, ఆర్య వంటి స్టార్ హీరోలు వివిధ సంవత్సరాలకు గానూ 'ఉత్తమ నటుడు' అవార్డులను కైవసం చేసుకున్నారు. మరోవైపు నయనతార, సాయి పల్లవి, జ్యోతిక వంటి నాయికలు కూడా తమ నటనకు గుర్తింపు పొందారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఫిబ్రవరి 13న చెన్నైలోని ప్రతిష్ఠాత్మక 'కలైవానర్ అరంగం'లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమలోని దిగ్గజాలందరూ హాజరుకానున్నారు.
బిజీ బిజీగా కీర్తి సురేష్..
'మహానటి'తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. ఆమె లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో అక్క (Akka) తెరకెక్కుతోంది. ఈ సినిమాతో కీర్తి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది ఒక హై-వోల్టేజ్ థ్రిల్లర్. ఇక రౌడీ జనార్దన మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి మొదటిసారి నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మలయాళంలో యాక్షన్ హీరో ఆంటోనీ వర్గీస్ సరసన కీర్తి నటిస్తున్న ఈ తొట్టం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విలక్షణ దర్శకుడు మైస్కిన్ నిర్మాణంలో ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ స్టోరీతో కీర్తి ముందుకు రాబోతోంది.
అవార్డులతో పాటు వరుస అవకాశాలతో కీర్తి సురేష్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. తమిళనాడు ప్రభుత్వ గుర్తింపు ఆమెకు మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు స్ఫూర్తినిస్తుంది. ఫిబ్రవరి 13న స్టేజ్ మీద కీర్తి అవార్డు అందుకునే క్షణం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
