Australian Open 2026: ఓడిపోయే మ్యాచ్‌లో అల్కరాజ్‌ అద్భుతం.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ స్టార్

Australian Open 2026: ఓడిపోయే మ్యాచ్‌లో అల్కరాజ్‌ అద్భుతం.. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో స్పెయిన్ స్టార్

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 సెమీ-ఫైనల్ 1 పోరు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్‌, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన సెమీస్ సమరం నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన వీరి థ్రిల్లింగ్ ఫైట్ లో అల్కరాజ్‌ అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం (జనవరి 30) జరిగిన ఈ మ్యాచ్ లో జ్వెరెవ్ పై  6-4, 7-6 (7-5), 6-7 (3-7), 6-7 (4-7) 7-5 స్కోర్ తో అల్కరాజ్ విజయం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ కు దూసుకెళ్లాడు. ఒక దశలో జ్వెరెవ్ విజయం ఖాయమనుకున్నా కీలక దశలో స్పెయిన్ స్టార్ తన అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించి మ్యాచ్ గెలిచాడు. 

తొలి సెట్ ను అల్కరాజ్ అలవోకగానే గెలుచుకున్నాడు. స్పెయిన్ స్టార్ దెబ్బకు జ్వెరెవ్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. 6-4 తో సెట్ కైవసం చేసుకున్న కార్లోస్ 1-0 ఆధిక్యములోకి వెళ్ళాడు. రెండో సెట్ లో జ్వెరెవ్ నుంచి స్పెయిన్ స్టార్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరూ తమ సర్వీసులు నిలబెట్టుకోవడంతో సెట్ టై బ్రేక్ కు వెళ్ళింది. టై బ్రేక్ లో 5-4 ఆధిక్యంలో ఉన్న జ్వెరెవ్ కీలక దశలో వరుసాగా పాయింట్లు కోల్పోవడంతో రెండో సెట్ కూడా అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు. మూడు, నాలుగు సెట్స్ కూడా ఇద్దరూ పోటా పోటీగా ఆడడంతో  టై బ్రేక్ కు దారి తీసింది.  

6-7 (3-7), 6-7 (4-7) ఈ రెండు సెట్లలో కూడా జ్వెరెవ్ అద్భుతంగా ఆడి విజయం సాధించి మ్యాచ్ ను ఫైనల్ సెట్ కు తీసుకెళ్లాడు. వరుసగా రెండు సెట్ లు గెలిచి దూకుడు మీదున్న జ్వెరెవ్.. నిర్ణయాత్మక ఫైనల్ సెట్ లో ప్రారంభంలోనే అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి 5-4 ఆధిక్యంలోకి వెళ్ళాడు. 'సర్వింగ్ ఫర్ ది మ్యాచ్' సమయంలో జ్వెరెవ్ తన సర్వీస్ కోల్పోయాడు. ఆ తర్వాత తన సర్వీస్ నిబెట్టుకున్న అల్కరాజ్ 6-5 ఆధిక్యంలోకి వెళ్ళాడు. కీలకమైన 12 గేమ్ లో జ్వెరెవ్ సర్వీస్ ను మరోసారి బ్రేక్ చేసిన కార్లోస్ 7-5 తేడాతో సెట్ తో పాటు మ్యాచ్ కు గెలిచాడు.