UAE vs IRE: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. రోహిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఐర్లాండ్ క్రికెటర్

UAE vs IRE: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. రోహిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఐర్లాండ్ క్రికెటర్

క్రికెట్ లో పసికూన ఆటగాళ్లు అని పట్టించుకోవడం మానేసినా కొంతమంది మాత్రం ఏకంగా ప్రపంచ రికార్డులు సృష్టిస్తారు. మట్టిలో మాణిక్యాల్లా జట్టు మొత్తం విఫలమైనా ఒక్కరే జట్టును ముందుండి నడిపిస్తారు. అలాంటి లిస్ట్ లో చాలా కొద్ది మంది ఆటగాళ్లే ఉంటారు. వారిలో ఒకరే ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్‌. 18 ఏళ్లుగా ఐర్లాండ్ క్రికెట్ జట్టులో కొనసాగుతున్న ఈ ఐరీష్ కెప్టెన్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లాడిన ప్లేయర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. 2009లో ఐర్లాండ్ తరపున టీ 20 క్రికెట్ లో అరంగేట్రం చేసిన స్టిర్లింగ్ ఇప్పటివరకు 160 మ్యాచ్ లతో టాప్ లో నిలిచాడు. 

గురువారం (జనవరి 29) యూఏఈతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి స్టిర్లింగ్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ప్రస్తుతం 160 మ్యాచ్ లతో స్టిర్లింగ్ టాప్ లో ఉండగా.. 159 మ్యాచ్ లతో రోహిత్ రెండో స్థానానికి పడిపోయాడు. రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వడంతో ఈ రికార్డ్ మరికొన్ని సంవత్సరాలు స్టిర్లింగ్ ఖాతాలో ఉండడం ఖాయంగా మారింది. మూడో స్థానంలో 153 మ్యాచ్ లతో తన దేశానికే చెందిన డాక్ రెల్ ఉన్నాడు. స్టిర్లింగ్ తన తొమ్మిదవ టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ మినహాయిస్తే మిగిలిన అన్ని టీ20 వరల్డ్ కప్ టోర్నీలు ఆడడం విశేషం. 

అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో స్టిర్లింగ్ నాల్గవ స్థానంలో ఉన్నాడు.  బాబర్ అగ్రస్థానంలో, రోహిత్ 2వ స్థానంలో.. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నారు. ఇక యూఏఈతో తన రికార్డ్ మ్యాచ్ లో స్టిర్లింగ్ విఫలమయ్యాడు. ఓపెనర్ గా కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. స్టిర్లింగ్ ఔటైనా ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యూఏఈ 19.5 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది.