మీ కుట్రలు ఇక చెల్లవ్.. సీఎం పదవి దక్కలేదన్న దుఃఖం తప్ప సర్కారుకు సహకరించాలన్న సోయి లేదు: సీఎం రేవంత్

మీ కుట్రలు  ఇక చెల్లవ్.. సీఎం పదవి దక్కలేదన్న దుఃఖం తప్ప సర్కారుకు సహకరించాలన్న సోయి లేదు: సీఎం రేవంత్
  • త్యాగాలతో వచ్చిన తెలంగాణను 
  • అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు నీతులు చెప్తరా? 
  • మీలాగా అబద్ధాలతో కాలం గడపడం మాకు చేతగాదు
  • సవాల్ ​చేస్తున్నా.. 2029లోనూ మిమ్మల్ని తొక్కుకుంటూ మళ్లీ అధికారంలోకి వస్తం
  • మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను కూల్చిపారేయాలన్నరు
  • ప్రతిపక్షంలోకి వచ్చాక మూసీ, చెరువుల ప్రక్షాళనకు అడ్డుపడ్తున్నరు
  • పాలమూరు బిడ్డగా చెబుతున్నా.. సంక్షేమమే మా లక్ష్యం, అభివృద్ధే మా మార్గం
  • పదేండ్లలో మీరు చేయని అభివృద్ధిని ఈ ఐదేండ్లలో చేసి చూపిస్తం
  • హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోకపోతే  భవిష్యత్ తరాలు క్షమించవు
  • టీడీఆర్, హిల్ట్​ పాలసీ, పారిశ్రామిక భూముల పంపిణీపై విచారణకు సిద్ధమని ప్రకటన
  • అవసరమైతే ఓఆర్ఆర్​ టెండర్ ​క్యాన్సిల్ చేసి అక్రమార్కులను బొక్కలో వేస్తామని హెచ్చరిక
  • అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంపై సీఎం రేవంత్​రెడ్డి ఫైర్

హైదరాబాద్​, వెలుగు: కడుపు నిండా కుళ్లు, కుతంత్రాలతో సర్కారుపై విషం చిమ్ముతున్న వాళ్ల కుట్రలు ఇకపై సాగవని  సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘వారసత్వంగా  సీఎం పదవి దక్కలేదన్న దుఃఖమే తప్ప సర్కారుకు సహకరించాలన్న సోయి ప్రధాన ప్రతిపక్షానికి లేదు.. త్యాగాలతో వచ్చిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి, 11 శాతం వడ్డీతో గొంతు కోసినోళ్లే ఇప్పుడు నీతులు చెప్తున్నారు.. మీలాగా అబద్ధాలతో కాలం గడపడం మాకు రాదు. పదేండ్లలో మీరు చేయని అభివృద్ధి ఈ ఐదేళ్లలో చేసి చూపిస్తం..  సవాల్ చేస్తున్నా.. 2029లోనూ మిమ్మల్ని తొక్కుకుంటూ మళ్లీ అధికారంలోకి వస్తాం.. మా పాలన 2034 వరకు కొనసాగుతుంది.. ’ అంటూ విరుచుకుపడ్డారు. 

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలన్న వారే, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే అన్నీ అక్రమమంటున్నారని.. నాడు బుల్డోజర్లు తెచ్చినోళ్లే నేడు అడ్డం పడుకుంటామంటున్నారని ఫైర్ అయ్యారు.

హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, మూసీ పునరుజ్జీవాన్ని పూర్తి చేసి తీరుతామన్నారు. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని హెచ్చరించారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన టీడీఆర్, హిల్ట్​ పాలసీ, పారిశ్రామిక భూముల పంపిణీపై విచారణకు సిద్ధమని వెల్లడించారు.  ఓఆర్​ఆర్​టెండర్​ క్యాన్సిల్​చేయడమే కాదు, సమయం వస్తే బాధ్యులను బొక్కలో వేయడం ఖాయమన్నారు.

2029లో ప్రజలే మీకు అంతిమ సంస్కారం చేస్తరు

అధికారం కోల్పోయిన దుఃఖం తప్ప, రాష్ట్ర భవిష్యత్తుపై ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే పనిగా పెట్టుకున్నోళ్లను కాలక్రమంలో ప్రజలు తిరస్కరించడం ఖాయమని అన్నారు.  ప్రధాని మోదీ దేశం కోసం ‘వికసిత్ భారత్ 2047’ అంటే.. తాము తెలంగాణ కోసం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేశామని చెప్పారు.  

2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇంతటి బృహత్తర ప్రణాళికను ఆహ్వానించాల్సింది పోయి, ప్రతి దాంట్లో రాజకీయం వెతకడం ప్రతిపక్షాల సంకుచితత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు. అధికారం పోయిందన్న కడుపు మంటతో ప్రతి మంచి పనిని వివాదం చేయడం మానుకోవాలని, వాస్తవాలు గ్రహించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. లేదంటే 2029లో ప్రజలే మీకు అంతిమ సంస్కారం చేస్తారని ప్రతిపక్షాలను హెచ్చరించారు. 

సోనియా దయతోనే తెలంగాణ.. అసెంబ్లీలో కేసీఆర్​చెప్పిండు.. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సోనియా దయతో, ఆమె ఆశీర్వాదంతోనే వచ్చిందని  కేసీఆర్  ఈ సభలో నిలబడి చెప్పారని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.   కానీ ఈరోజు బావాబామ్మర్దులు (కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు) కలిసి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా తుడిపేసే కార్యక్రమం పెట్టుకున్నారని విమర్శించారు. ‘‘తండ్రి బతికుండగానే ఆయన మాటలకు తద్దినం పెడుతున్న ఈ విశ్వాసఘాతకులను చూస్తుంటే జాలేస్తోంది”అని అన్నారు. 

సోనియాగాంధీపై అమర్యాదగా మాట్లాడే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.  2029లో కూడా మిమ్మల్ని ప్రజలు తొక్కడం ఖాయమని, అప్పటివరకూ ఈ విపరీత పోకడలను ఆపాలని బీఆర్ఎస్​నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.  సోషల్ మీడియాలో డబ్బులిచ్చి లైకులు, కామెంట్లు కొట్టించుకునే నూతన భట్రాజుల సంస్కృతిని వీడాలని హితవు పలికారు. 

 మెట్రో సంస్థనూ బ్లాక్​ మెయిల్​చేశారు 

గత ప్రభుత్వం మెట్రో సంస్థనూ బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడటం వల్లే విస్తరణ పనులు ఆగిపోయాయని  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. తాము రూ. 15 వేల కోట్లతో రూ. 25 వేల కోట్ల విలువైన మెట్రో సంస్థను  స్వాధీనం చేసుకొని, రూ. 10 వేల కోట్ల లాభంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.   వరి నుంచి రైతుల దృష్టిని మళ్లించి కమర్షియల్ క్రాప్స్, పండ్ల తోటలు, కూరగాయల సాగు వైపు ప్రోత్సహించబోతున్నామని తెలిపారు. 

తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన ఫ్యూచర్ సిటీలో ‘శ్రేయాస్ వన్ సిటీ’ బ్రోచర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేయబోతున్నామని చెప్పారు. ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి పాలసీని తెచ్చామని, ఇప్పటికే 57 వేల కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీని కల్పించి మహిళలను లక్షాధికారులను చేస్తున్నామని స్పష్టం చేశారు.   

చింపిన విస్తరాకులా ప్రతిపక్షం 

 యజమానిని బట్టే చిలుకల భాష ఉంటుందని, ప్రతిపక్ష నేతల తీరు కూడా అలాగే తయారైందని అని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. పెద్ద మనిషి (కేసీఆర్) విశ్రాంతి తీసుకుంటున్నారని, పార్టీని కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌ చేతికి అప్పగిస్తే దాన్ని ‘చింపిన విస్తరాకు’లా చేస్తున్నారని విమర్శించారు.  మెక్సికోలో డ్రగ్ మాఫియా డాన్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు కాల్చి చంపితే.. ఇక్కడ ప్రతిపక్ష నేతలు మాత్రం అలాంటి కింగ్‌‌‌‌‌‌‌‌పిన్‌‌‌‌‌‌‌‌లను పిలవాలంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ తానేమో ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ మాంత్రికుడు మెస్సీని రమ్మంటున్నానని.. వారికీ, తమకు అదే తేడా అని చెప్పారు.  తెలంగాణ యువతను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, ప్రతిపక్షం మాత్రం విషం చిమ్ముతున్నదని మండిపడ్డారు. 

కుటుంబమే తెలంగాణ అనుకున్నరు..

‘‘కుటుంబమే తెలంగాణ అనుకున్న రాక్షస మనస్తత్వం మీది .. తెలంగాణే నా కుటుంబం అనుకునే సంస్కృతి మాది” అని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలనుద్దేశించి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ అన్నారు.  అమరవీరుల త్యాగాలను అడ్డం పెట్టుకుని మీ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకోవడమేనా మీరు సాధించిన తెలంగాణ? అని ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేశారని, క్వశ్చన్ పేపర్లను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లా అమ్ముకున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే గ్రూప్–-1 అడ్డంకులన్నీ తొలగించి 562 మందికి నియామక పత్రాలు ఇచ్చామని, ఇవాళ మున్సిపల్ కమిషనర్లుగా, డీఎస్పీలుగా ఎంపికైన ఆ బిడ్డలను చూస్తుంటే తన కడుపు నిండింది అని చెప్పారు.  

పదేండ్లలో అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలపై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. ‘‘గత ప్రభుత్వం అధిక వడ్డీకి భారీ స్థాయిలో అప్పులు చేసింది. రూ.లక్షల కోట్ల అప్పులను తక్కువ వడ్డీకి రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ చేశాం. దీంతో ఏటా రూ.4 వేల కోట్లు ఆదా అవుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో రూ.3.50 లక్షల కోట్లు చెల్లించాం” అని పేర్కొన్నారు.  

 సొంతింటి ఆడబిడ్డనే కన్నీరు పెట్టించిన ‘రాక్షస’ మనస్తత్వం 

 ఇందిరా మహిళా శక్తి ద్వారా ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెడుతుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. ‘‘బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో మొదటి ఐదేండ్లు ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వని సంస్కృతి మీది. మీ ఇంట్లో ఆడబిడ్డల మీద మీకు చిన్నచూపు ఉండొచ్చు, అది మీ పార్టీ విధానం కావచ్చు. కానీ మేం తెచ్చిన మహాలక్ష్మి పథకాన్ని గౌరవించరా? సొంత చెల్లెలిని మీ పక్కన కూర్చున్న వాళ్లే ‘లిక్కర్ రాణి’, ‘లిక్కర్ క్వీన్’ అని బహిరంగంగా దూషిస్తుంటే.. ఒక సోదరుడిగా నీకు కనీసం చీమ కుట్టినట్లయినా అనిపించలేదా? రాజ్యాల కోసం కుత్తుకలు కోసుకున్న దాయాదుల పోరు భారతం నుంచి చూస్తున్నాం.. కానీ సొంత ఇంటి ఆడబిడ్డను దుబాయ్ నుంచి సోషల్ మీడియాలో తిట్టించడం ఏ రకమైన గౌరవం?’’ అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.  

ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్ నిధులను కొల్లగొట్టిన దొంగలు..

పేదలకు అందాల్సిన వైద్య సహాయాన్ని కూడా గత ప్రభుత్వం అప్పనంగా దోచుకున్నదని రేవంత్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని పదేండ్ల పాలనలో నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గత పాలకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా వదలకుండా దొంగిలించారని అన్నారు. తమ ఫ్యూచర్ సిటీని, 2047 విజన్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ను వెక్కిరిస్తున్న వారికి రామాయణంలో రావణుడి గతే పడుతుందని అన్నారు.

 ‘‘ఇక్కడ నెత్తి దువ్వుకుంటున్న ఈయనను (హరీశ్‌‌‌‌‌‌‌‌రావు) కనీసం వార్డ్ మెంబర్ కూడా కాకముందే వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్రిని చేశారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరి దయతో మంత్రివయ్యావు? ఇక ఆ వెనక ఉన్నాయన (కేటీఆర్) సిరిసిల్లలో సొంత పార్టీ నేతలను, తన కులస్తులను మోసం చేసి, చంద్రబాబు కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు. మీరు ద్రోహులు. నేను స్వశక్తితో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా గెలిచిన పాలమూరు బిడ్డను. మట్టి పని, తట్ట పని చేసి ప్రజల నుంచి వచ్చాను. నా కాలిగోటికి కూడా మీరు సరిపోరు” అని మండిపడ్డారు. అసలు మానవ జన్మ ఎత్తినోడికి ఉండాల్సిన ‘కృతజ్ఞత’ అనే పదం మీ జాతిలోనే లేదని, 2009లో తానే భుజాల మీద మోసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎంపీగా గెలిపించిన చరిత్ర మర్చిపోవద్దన్నారు. 

2034 వరకు మాదే అధికారం.. 

2029 ఎన్నికలు తమకు కేవలం ఒక ‘పాసింగ్ క్లౌడ్’ మాత్రమేనని. 2034 వరకు ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే ఉంటుందని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తీసుకెళ్తాం అని స్పష్టం చేశారు. బ్లూ కాలర్ ఉద్యోగాల విప్లవంతో తెలంగాణను ప్రపంచానికే నైపుణ్య కేంద్రంగా మారుస్తామని స్పష్టం చేశారు.  

ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదలం

 దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు కాలుష్యం, ట్రాఫిక్, వరదలతో అతలాకుతలం అవుతుంటే.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ఆ గతి పట్టనీయబోమని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.  అందుకే మూసీ ప్రక్షాళనతోపాటు ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ఈరోజు తాము హైడ్రా ద్వారా ఆ ఆక్రమణలను తొలగిస్తుంటే.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా, సినిమా స్టార్లయినా సరే వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. 

‘‘మూసీలో ఆక్రమణలు చేసిందెవరు? క్రికెట్ స్టేడియంలు కట్టిందెవరు? ఎవరి అనుచరులు పేదలకు ఇండ్లు అమ్ముకొని డబ్బులు వసూలు చేశారో తేల్చడానికి అసెంబ్లీ నుంచి నిజనిర్ధారణ కమిటీ వేస్తాం”అని ప్రకటించారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు 28 వేల అక్రమ కట్టడాలను నోటీసులు ఇవ్వకుండానే జేసీబీలు, బుల్డోజర్లతో కూల్చివేయాలని సాక్షాత్తూ అప్పటి సీఎం , మున్సిపల్ మంత్రి ఆదేశించలేదా? అని ప్రశ్నించారు.  

ఆనాడు సక్రమంగా కనిపించిన కూల్చివేతలు.. నేడు తాము ప్రజా సంక్షేమం కోసం చేస్తుంటే అక్రమ వసూళ్లుగా ఎలా కనిపిస్తున్నాయి? అని ప్రశ్నించారు.   ‘‘బీజేపీ నేతలు సబర్మతి, గంగా, యమునా నదుల ప్రాజెక్టుల గురించి గొప్పగా చెప్తున్నారు. కానీ, మూసీ ప్రాజెక్టును మాత్రం తప్పుపడుతున్నారు. మూసీ పరివాహకంలో ఎవరి అనుచరులు క్రికెట్‌‌‌‌‌‌‌‌ మైదానాలు నిర్మించారో ప్రజలకు తెలుసు” అని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి..

ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటయ్యేందుకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విధానాలే కారణమని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.‘‘పీవీ, నేదురుమల్లి జనార్దన్‌‌‌‌‌‌‌‌రెడ్డి తొలిసారి హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీకి పునాది రాయి వేశారు. అనంతరం చంద్రబాబు, వాజ్‌‌‌‌‌‌‌‌పేయీ హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీని పూర్తి చేశారు. ప్రస్తుతం ఏఐ ద్వారా లక్షలాది ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య తలెత్తే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంది” అని పేర్కొన్నారు. 

గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న సంస్కారం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేకపాయే

తెలంగాణ తల్లికి, రాష్ట్ర గీతానికి గౌరవం ఇచ్చే సంస్కృతి కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేదని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ ఎద్దేవా చేశారు. ‘‘తొలిసారి  గవర్నర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, జయ జయహే తెలంగాణ గీతానికి లేచి నిలబడి గౌరవం ఇస్తుంటే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం దారుణం. మీ బాధ్యతను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తున్నది” అని అన్నారు.  1200 మంది విద్యార్థుల బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణలో..వారి ఆశయాలను తుంగలో తొక్కారని   ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘శ్రీకాంతాచారి, ఈషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్యలాంటి ఎందరో యువకులు తమ ప్రాణాలు అర్పించింది మీ ‘అగ్గిపెట్టె రావుల’ను మంత్రులను చేయడానికో, మీ కొడుకులను, బిడ్డలను ఎంపీలు, ఎమ్మెల్సీలుగా గద్దె ఎక్కించడానికో కాదు. నాడు వంద రూపాయలకు పెట్రోల్ దొరికింది కానీ, అగ్గిపెట్టె దొరకలేదు. మీ చుట్టాలను రాజ్యసభలకు పంపడానికి ఆ పిల్లలు చనిపోలేదు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బతుకులు బాగుపడాలని వారు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. అబద్ధాల కోసం నెలకు ఐదు కోట్లు ఖర్చు చేసే మీ సోషల్ మీడియా బ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఎన్ని కట్టుకథలు చెప్పినా నిజం దాగదు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం, నిరుద్యోగుల కలలు నిజం చేస్తాం” అని పేర్కొన్నారు.

కేసీఆర్​ కోటి రూపాయలు తీస్కుంటూ సభకు రారా..?

 అధ్యక్షా.. ప్రధాన ప్రతిపక్ష నేతగా డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు  కోటీ 6 లక్షల 56 వేల 674 రూపాయల జీతభత్యాలు పొందిన కేసీఆర్  సభకు ఎందుకు రావడం లేదు? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? సుప్రీంకోర్టు నిర్వచనం ప్రకారం ప్రజా ప్రతినిధులు కూడా పబ్లిక్ సర్వెంట్లే. మరి విధులకు రాని వారిపై చర్యల గురించి సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వారసత్వంగా అధికారం వస్తుందని ఆశపడి భంగపడ్డారు కాబట్టే.. ఆ బాధతో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ప్రతిపక్ష నేతలు ఉన్నారు. ఇప్పటికైనా అహంకారాన్ని వీడి, రాచరికపు ఆలోచనల నుంచి బయటకు వచ్చి సభకు హాజరు కావాలని మాజీ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాను 
- సీఎం రేవంత్​రెడ్డి