బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..మార్షల్స్ మధ్య తోపులాట

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..మార్షల్స్ మధ్య తోపులాట
  • అసెంబ్లీలో ఎమ్మెల్యేల  ఎంట్రీ పాయింట్ వద్ద ఉద్రిక్తత
  •     మక్క కంకులను లోపలికి అనుమతించని మార్షల్స్.. కింద పారబోత 
  •     మార్షల్స్ తో ఎమ్మెల్యేల వాగ్వాదం 

హైదరాబాద్, వెలుగు: మక్కల కొనుగోళ్లు చేపట్టాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. వారు మక్క కంకులను తీసుకుని అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడి చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఎంట్రీ పాయింట్ వద్దే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మార్షల్స్​కు మధ్య పెనుగులాట జరుగగా, హరీశ్ చేతికి స్వల్ప గాయమైంది. మార్షల్స్ మక్కలను కిందపారబోశారు. పోలీసులను పెట్టి రైతు సమస్యలను అణగదొక్కాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. 

తోపులాట జరగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మక్క రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. అసెంబ్లీకి ర్యాలీగా  రాగా,  మార్షల్స్ అనుమతించలేదు.   

సీఎం మాట నమ్మి మక్కలేస్తే.. ఇప్పుడు కొనరా: హరీశ్ 

వరి వేయొద్దని, పంట మార్పిడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పదే పదే చెబితే.. వారి మాటలు నమ్మి రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో రైతులు మక్క పంట వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు తీరా పంట చేతికి వచ్చాక ఆ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని ఆరోపించారు. గన్​పార్క్ వద్ద నిరసన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొక్కజొన్న మార్కెట్లకు రావడం మొదలై ఇప్పటికే 15 రోజులు అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమన్నారు. 

దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మొక్కజొన్నకు మద్దతు ధర రూ. 2,400 ఉంటే.. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయట మార్కెట్లో దళారులకు రూ. 1,600 నుంచి 1,700కే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పదిహేను రోజులుగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం చూస్తుంటే ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందన్నారు. 

పంట అంతా దళారుల పాలైన తర్వాత, ఆ దళారుల దగ్గర ఎక్కువ ధరకు కొని వాళ్లకు మేలు చేయాలని ప్రభుత్వం చూస్తోందా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందా? దళారులకు మేలు చేస్తుందా? అనేది స్పష్టం చేయాలన్నారు. బడ్జెట్ లో పంటల బీమా గురించి గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదన్నారు.