- అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదనలతో హోరెత్తిన అసెంబ్లీ
- పేదల బతుకులు కూలుస్తున్నారు: కేటీఆర్
- డీపీఆర్ రెండు నెలల్లో ఎట్లా తయారు చేశారని ప్రశ్న
- రూ.16 వేల కోట్లతో అయ్యే పనులకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నారని ఫైర్
- పేదల బతుకులు బాగు చేయడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదా? అని భట్టి కౌంటర్
- రెండు నెలల్లో డీపీఆర్ తయారీ అన్నది పూర్తి అబద్ధమన్న మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలతో అసెంబ్లీ హోరెత్తింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. మూసీ ప్రక్షాళనతో పేదల బతుకులు కూలుస్తున్నారని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే.. తాము పేదల బతుకులు నిలబెడుతున్నామని, ఇది ఇష్టంలేకే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పక్ష నేతలు దీటుగా స్పందించారు.
లక్షన్నర కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తే.. వాటిని అధికారపక్ష సభ్యులు తిప్పికొట్టారు. వాదోపవాదాల మధ్య.. బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఆ వెంటనే మళ్లీ వచ్చి సభలో కూర్చోవడం గమనార్హం. బుధవారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ మాట్లాడారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూసీ ప్రాజెక్టును చేపట్టారని, లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
రెండున్నర నెలల్లో డీపీఆర్‌ను తయారు చేశారని, ఇప్పటిదాకా డీపీఆర్ లేకుండానే ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) లోన్లు ఇచ్చిందంటూ తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు. కాగా, దీనికి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు. అన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. ఏడాదిన్నర క్రితం నుంచే డీపీఆర్ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఏడీబీ లోన్లు ఇచ్చేందుకు ఓ పద్ధతి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కేటీఆర్‌కు దీటుగా బదులిచ్చారు. బీఆర్‌ఎస్ వాళ్లకు పేదల బతుకులు బాగుపడడం ఇష్టం లేదేమోనంటూ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ: కేటీఆర్
మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని కేటీఆర్అన్నారు. కానీ, ప్రభుత్వం పేదల బతుకు కూలుస్తూ.. మూసీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నదని, దానికి మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటని ప్రశ్నించారు. సీఎం ఒకవైపు లక్షన్నర కోట్లు అంటుంటే సభలో మాత్రం నాలుగైదు వేలకోట్లు అని చెప్పడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్ పేరిట ప్రజల ఆస్తులు, ఇళ్లు కూల్చినా.. జీవనోపాధిని దెబ్బతీసే చర్య లు చేపట్టినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోం” అని అన్నా రు.
మూసీ ప్రక్షాళనకు డీపీఆర్ ఉందా? లేదా? అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘కేవలం 2 నెలల్లో డీపీఆర్ తయారు చేశారా? గతంలో 18 నెలలు పడుతుందని చెప్పి ఇప్పుడు ఇంత త్వరగా ఎలా సాధ్యమైంది? ఒకవేళ అంత అద్భుతమైన డీపీఆర్‌ను తయారు చేసి ఉంటే దానిని ప్రజల ముందు పెట్టండి. ప్రభుత్వం ఎలాంటి చమత్కారం చేసిందో చూపించాలి” అని అన్నారు.
పేదలు మురికి కూపంలోనే బతకాలని కోరుకుంటున్నరా?: భట్టి
మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత అని, మురుగు నీరు, ఈగలు, దోమలు, రోగాల మధ్య దయ నీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు.. పేదలు అదే మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా? అని నిలదీశారు. నివాసాలు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి పట్టా ఉన్నా లేకపోయినా అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామని ఇప్పటికే సీఎం పలుమార్లు చెప్పార న్నారు.
అంతేకాకుండా అక్కడి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని వెల్లడించారు. వారి పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరాని కి మణిహారంగా మూసీని తీర్చిదిద్దుతుంటే ప్రతి అడు గులో అడ్డుపడటం సరికాదన్నారు.
ఈ మహా యజ్ఞం ద్వారా మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజల జీవనప్రమాణాలు పెంచడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గండిపేట నుంచి బాపు సరోవర్ వరకు మొదటి దశలో చేపడుతున్న ఈ పునరుజ్జీవన కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్నది కాదని, మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రతి నిర్ణయంలోనూ అత్యంత పేదవాడి కన్నీళ్లు తుడవాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేద ప్రజలకు అత్యుత్తమమైన, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి వారినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు.
మా ప్రతి ప్రయత్నానికీ బీఆర్‌ఎస్ అడ్డు: శ్రీధర్‌బాబు
మూసీ ప్రక్షాళనపై బీఆర్‌ఎస్ వైఖరి మొదటి నుంచీ ‘బురదజల్లుతాం.. మీరే తుడుచుకోండి’ అన్నట్టుగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్‌లో రూ.6,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. కేటీఆర్ మాత్రం లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో బురద చల్లుతున్నారని విమర్శించారు.
మూసీ కాలుష్యం అనేది జంట నగరాలకు సంబంధించిన ప్రధాన సమస్య అని, దీని కోసం తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని బీఆర్ఎస్ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తున్నదని అన్నారు. డీపీఆర్ తయారీకి మెయిన్‌హార్ట్ సంస్థకు 2024 డిసెంబర్‌లో బాధ్యతలు అప్పగించామన్నారు. 2025 జనవరిలో తయారీ మొదలైందని, 2026 ఫిబ్రవరిలో పూర్తయిందని చెప్పారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్‌గా గుర్తిస్తూ 2016 లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని అడుగుతున్నరని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు. పేదలకు పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని వివరించారు. ‘‘ఆ పార్టీకి ప్రజల మేలు గురించి అవసరం లేదు. మేం ఏ సంకల్పం మొదలు పెట్టినా అభాండాలు వేయడం అలవాటై పోయింది. ప్రజల మేలు కంటే రాజకీయ ఆరోపణలకే బీఆర్‌ఎస్ ప్రాధాన్యం ఇస్తున్నది. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)కు డీపీఆర్ పంపించాం. తదుపరి బోర్డు మీటింగ్‌లో ఏడీబీ నిర్ణయం తీసుకుంటుంది. ఏడీబీ తిరస్కరించడం అనేది అవాస్తవం. ’’ అని ఆయన స్పష్టం చేశారు.
