కొత్త డీజీపీ రేస్లో ముగ్గురు.. సీవీ ఆనంద్, ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు సిఫార్సు చేసిన యూపీఎస్సీ

కొత్త డీజీపీ రేస్లో ముగ్గురు.. సీవీ ఆనంద్, ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు సిఫార్సు చేసిన యూపీఎస్సీ
  • సీనియర్ అయిన సీవీ ఆనంద్‌‌కు ఎక్కువ చాన్స్‌‌.. 
  • ఏప్రిల్ 30న శివధర్‌‌‌‌రెడ్డి పదవీ విరమణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీ నియామక ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. పూర్తి కాలం డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు ఐపీఎస్ అధికారుల లిస్ట్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ప్రస్తుత హోంశాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌‌‌‌తోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పెషల్ డైరెక్టర్ వినయ్ ప్రభాకర్ ఆప్టే, తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యా మిశ్రాతో కూడిన ఫైనల్ లిస్టును రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ అందించింది. ఇందులో ప్రభుత్వం ఒకరిని ఎంపిక చేసి.. ఫుల్ టైమ్ డీజీపీగా నియమించనున్నది. ప్రస్తుత డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 30తో ముగియనుండడంతో.. ఆ లోపు ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనున్నది. 

సీవీ ఆనంద్‌‌‌‌కే ఎక్కువ అవకాశాలు..

సీనియారిటీ, ఇతర అంశాలను పరిశీలిస్తే రాష్ట్ర డీజీపీగా సీవీ ఆనంద్‌‌‌‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయన 1991 బ్యాచ్‌‌‌‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ కావడంతోపాటు నిబంధనల ప్రకారం సెంట్రల్ సర్వీసెస్ లో పనిచేశారు. 1994 బ్యాచ్‌‌‌‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యమిశ్రాలతో బ్యాచ్ పరంగా పోలిస్తే సీవీ ఆనంద్ సీనియర్. రాష్ట్రంలో ఏఎస్పీ నుంచి డీజీపీ హోదావరకు పలు స్థానాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. 

ఇక ఆప్టే ఐబీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. నిరుడు సెప్టెంబరులో స్పెషల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలోనే సెంట్రల్ సర్వీసెస్ లోనే ఉన్నతస్థాయిలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని సీవీ ఆనంద్‌‌‌‌నే పూర్తి కాలపు డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.