- బండి సంజయ్‌కు ఇచ్చింది క్యాబినెట్ హోదానేనా?: మంత్రి శ్రీధర్ బాబు
- క్షమాపణ చెప్పాలని డిమాండ్
- మత్స్యకారుడికి మత్స్యశాఖ ఇవ్వడం కాంగ్రెస్ కే సాధ్యం: మంత్రి వాకిటి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రుల పోర్ట్‌ఫోలియోల అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సభ ప్రారంభం కాగానే.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో వేడి పుట్టించాయి. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ బీసీలకు పశుసంవర్ధక శాఖ ఇచ్చారని.. కోళ్లు, గొర్రెలకు సంబంధించిన శాఖ ఇస్తే ఏం చేయగలుగుతారని అన్నారు.
స్వయంగా మంత్రే తనకు కేటాయించిన శాఖపై మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మీ ప్రభుత్వంలో విద్య, హోం, మున్సిపల్‌శాఖలు బీసీలకు కేటాయించవచ్చు కదా అని, బీసీలకు 42 శాతం మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
చులకన భావంతో మాట్లాడటం సరికాదు
బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. బీసీ మంత్రి పట్ల మహేశ్వర్ రెడ్డి చులకన భావంతో మాట్లాడటం సరికాదన్నారు. సభను పక్కదోవ పట్టించేందుకు బీజేఎల్పీ నేత ఇలా మాట్లాడుతున్నారని ఫైర్అయ్యారు. ‘కోళ్ల పరిశ్రమపై ఆధారపడి రాష్ట్రంలో వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి.
ఏ శాఖా తక్కువ కాదు, ఏ శాఖా ఎక్కువ కాదు. మంత్రులందరూ ఒక్కటే’ అని స్పష్టం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని మహేశ్వర్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ‘పార్లమెంట్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు కానీ, క్యాబినెట్ హోదా ఇచ్చారా?’ అని నిలదీశారు.
నా వృత్తికి సంబంధించిన శాఖ దక్కడం నా అదృష్టం
తనకు కేటాయించిన శాఖపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి వాకిటి శ్రీహరి కొట్టిపారేశారు. తాను చిన్నప్పటి నుంచి ఏ వృత్తిలో అయితే కష్టపడ్డానో.. అదే శాఖను కేటాయించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. శాఖను మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మత్స్యకారుడికి మత్స్యశాఖ ఇవ్వడం కాంగ్రెస్ కే సాధ్యమైందని, ఇది చరిత్రాత్మకమన్నారు.
కేంద్రం తెలంగాణకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. మూసీని ప్రక్షాళన చేయడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, పేదలు మురుగు నీటిలో జీవించొద్దనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపడుతోందన్నారు. సబర్మతీ నది ప్రక్షాళన కోసం గుజరాత్ ఇండ్లు కూలగొడితే తప్పులేదు కానీ, మూసీ ప్రక్షాళన చేస్తే తప్పా అని నిలదీశారు.
317 జీవోపై మహేశ్వర్‌రెడ్డి, పొన్నం మధ్య డైలాగ్ వార్
317 జీవోపై అసెంబ్లీలో మహేశ్వర్‌రెడ్డి, మంత్రి పొన్నం మధ్య డైలాగ్వార్నడిచింది. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభుత్వం లాఠీఛార్జ్ చేసిందన్నారు. 42 శాతం మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. దీంతో మంత్రి పొన్న ప్రభాకర్కలగజేసుకొని 317 జీవోలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించామన్నారు.
తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏం ఇస్తోందో చెప్పాలని, 8 మంది పార్లమెంట్ సభ్యులు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని నిలదీశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల బీజేపీ విషం చిమ్ముతోందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గర వెళ్లిందని, బీజేపీ నేతలు బిల్లును ఆమోదింపజేయాలని కోరారు.
