- తీవ్ర ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్
- ఇరాన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్
- కుమార్తె ఇంట్లోనే లారిజానీ హతం.. ధ్రువీకరించిన ఇరాన్
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకరంగా మారింది. బుధవారం (మార్చి 18) హార్మూజ్ ప్రాంతంలోని ఇరాన్ భూగర్భ మిసైల్ కేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తీరప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేసిన క్షిపణి కేంద్రాలపై బుధవారం భారీ దాడులు నిర్వహించినట్టు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో అత్యంత శక్తివంతమైన 5,000 పౌండ్ల (సుమారు 2,268 కిలోల) 'బంకర్ బస్టర్' బాంబులను ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
భూగర్భంలో, కాంక్రీట్ కవచాల మధ్య దాగి ఉన్న ఇరాన్ యాంటీ -షిప్ క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగినట్టుగా తెలిపింది. ఈ ప్రాంతంలో ఇరాన్ మోహరించిన 'యాంటీ- షిప్ క్రూయిజ్ క్షిపణులు' వాణిజ్య నౌకలకు ముప్పుగా మారాయని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. సముద్ర మార్గాన్ని తిరిగి తెరిపించి, చమురు రవాణాను పునరుద్ధరించడమే ఈ దాడుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
అయితే, ఈ సైనిక చర్య విషయంలో నాటో సహా ఇతర ప్రధాన మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చమురు సరఫరాను పునరుద్ధరించడానికి ఇతర దేశాలు ముందుకు రావడం లేదని, అయినప్పటికీ ఈ యుద్ధాన్ని ఒంటరిగానే ముందుకు తీసుకెళ్లేందుకు తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
కుమార్తె ఇంట్లోనే లారిజానీ హతం
ఇరాన్ రక్షణ, అణు విధానాల రూపశిల్పి, సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు ఇరాన్ అధికారులు ధృవీకరించారు. టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని పర్డిస్‌లో ఉన్న తన కుమార్తె నివాసంలో లారిజానీ ఉండగా మంగళవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో లారిజానీతో పాటు ఆయన కుమారుడు మొర్తెజా లారిజానీ, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ అలీరెజా బయాత్, మరికొందరు బాడీగార్డులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
లారిజానీని ఇజ్రాయెల్ హతమార్చడంపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌పై 'నిర్ణయాత్మకమైన, పశ్చాత్తాపపడేలా చేసే' దాడి చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన లారిజానీ, ఆయన కొడుకు మొర్తెజాతోపాటు బాసిజ్ పారామిలటరీ దళం అధిపతి గులామ్ రెజా సులేమానీ, ఇతరుల అంత్యక్రియలు బుధవారం టెహ్రాన్‌లో జరిగాయి.
ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి కూడా మృతి!
ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ ఖతీబ్‌ను రాత్రిపూట జరిగిన దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ బుధవారం ప్రకటించారు. "మేం వారిని అడ్డుకోవడం, వేటాడటం కొనసాగిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అగ్రశ్రేణి అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి, ముందస్తు అనుమతులు అవసరం లేకుండానే సైన్యానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పూర్తి స్వేచ్ఛనిచ్చారని కాట్జ్ వెల్లడించారు.
ఇరాన్ పై మరిన్ని ఆశ్చర్యకరమైన దాడులు ఉండబోతున్నాయని కాట్జ్ హెచ్చరించారు. అయితే ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. బుధవారం బీరుట్‌లోని అపార్ట్‌మెంట్ భవనాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో12 మంది మరణించారు. అటు ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం వద్ద ఒక క్షిపణి పడినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఏఐఈఏ) నివేదించింది. దక్షిణ ఇరాన్‌లో న్యాయస్థాన భవనంపై జరిగిన దాడిలో 11 మంది పౌరులు, సిబ్బంది మరణించినట్లు మీజాన్ వార్తా సంస్థ తెలిపింది.
ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్
ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ హత్యకు ప్రతీకారంగా సెంట్రల్ ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ క్షిపణులను ప్రయోగించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ఇరాన్ అత్యాధునిక మల్టిపుల్ వార్‌హెడ్ క్షిపణులను వాడింది. రక్షణ వ్యవస్థలను సులువుగా ఛేదించగల ఈ క్షిపణుల వల్ల టెల్ అవీవ్ సమీపంలోని రామత్ గాన్ ప్రాంతంలో ఇద్దరు మరణించారు. బుధవారం కూడా ఇరాన్ తన పొరుగు దేశాలైన సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈలపై దాడులు చేసింది.
సౌదీలోని కీలక చమురు క్షేత్రాలు ఉన్న తూర్పు ప్రావిన్స్‌ను లక్ష్యంగా చేసుకుంది. దుబాయ్ సమీపంలోని అల్ మిన్హాద్ వైమానిక స్థావరం వద్ద ఒక క్షిపణి పడటంతో చిన్నపాటి మంటలు చెలరేగాయి. సౌదీలోని 'ప్రిన్స్ సుల్తాన్' ఎయిర్ బేస్ వైపు దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ రక్షణ దళాలు కూల్చివేశాయి. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సహా ఇతర విదేశీ మిషన్లు ఉండే దౌత్య కార్యాలయాల ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న రెండు డ్రోన్లను కూడా అడ్డుకున్నాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై వరుసగా రెండో రోజు దాడులు జరిగాయి.
మొదటి వారంలోనే 200 మంది సోల్జర్లు హతం
అమెరికా, ఇజ్రాయెల్ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని, ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. మొదటి వారంలోనే 200 మంది సైనికులతో పాటు, 150 క్షిపణి లాంచ్ ప్లాట్‌ఫారమ్‌లు, 23 పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, 37 విమానాలు, హెలికాప్టర్లను అమెరికా కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్ వద్ద ఉన్న ఆయుధ నిల్వల్లో 43% ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయాయని చెప్పారు. కాగా, 'మొసాద్' కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో ఒక వ్యక్తికి ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది.
రష్యా చమురు ట్యాంకర్ల భారత్ వైపు మళ్లింపు
రష్యా ముడిచమురు రవాణాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు ట్యాంకర్లు దారి మార్చుకుని భారత్ వైపు వస్తున్నాయి. రష్యా నుంచి దిగుమతులను భారత్ భారీగా పెంచడంతో ఈ మార్పులు జరుగుతున్నాయి. వార్టెక్సా సంస్థ నివేదిక ప్రకారం.. చైనాకు వెళ్లాల్సిన కనీసం 7 రష్యా చమురు ట్యాంకర్లు మధ్యలోనే భారత్ వైపు మళ్లాయి.
ఇరాన్‌లో 1,444 మంది మృతి..
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌లో 1,444 మంది మరణించగా, 18,551 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 200 మంది మహిళలు, మినాబ్ ప్రైమరీ స్కూలు చిన్నారులు 168 మంది ఉన్నారు. ఇరాన్ దాడుల్లో 17 మంది ఇజ్రాయెలీలు మరణించగా, 3,727 మంది గాయపడ్డారు. ప్రాంతీయంగా జరిగిన దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు మరణించినట్లు ఆ దేశ సైన్యం ధ్రువీకరించింది. ఇరాక్‌లో అమెరికా రీఫ్యూయలింగ్ విమానం కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో 912 మంది మరణించగా, 2,221 మంది గాయపడ్డారు. ఇరాక్ లో 58 మంది మరణించారు. అలాగే యూఏఈలో 8 మంది మరణించగా, 158 మంది గాయపడ్డారు. కువైట్‌లో ఆరుగురు మరణించారు.
