- ఆరు గ్యారంటీల ప్రస్తావన లేదు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ‘‘ఐఐటీ, ఐఐఐటీకి తేడా తెలువని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు.. కేరళ ఎన్నికల నిధుల కోసం ప్రణాళికకు తెరలేపారు.. పేదల ఇండ్లు కూల్చారు తప్ప, ఒక్క ఇల్లు కట్టలేదు”అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్వద్ద ఆయన మాట్లాడారు. తాము మిషన్ కాకతీయలో 30 వేల చెరువులు అభివృద్ధి చేస్తే మీరు మూడు చెరువులు అభివృద్ధి చేసి డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో సబ్జెక్టు లేదని, ఆరు గ్యారంటీల ప్రస్తావనే లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు తగిన అవకాశాలు కల్పించడంలో విఫలమైందని, ఉద్యోగాల భర్తీ పరిమితంగానే జరిగిందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన ఖర్చులపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ప్రణాళికల అమలులో పారదర్శకత లేదని విమర్శించారు. అలాగే, పేదల ఇండ్ల నిర్మాణం కంటే కూల్చివేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులా, ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు అని ఎన్ని సార్లు చెప్తారని ప్రశ్నించారు. ఇది బడ్జెట్ సెషనా, లేక కాంగ్రెస్ డబ్బానా అర్థం కావడం లేదన్నారు.
మహాలక్ష్మీకి మంగళం పాడారని, రైతన్నలకు 28 వేల కోట్లు బాకీ ఉన్నారన్నారు. కేసీఆర్ చేసిన అప్పు 2.80 లక్షల కోట్లు అని కేంద్రం చెప్తే రూ.8 లక్షల కోట్లు అని అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ చేసిన అప్పు రేవంత్ రెడ్డి రెండేండ్లలో చేశారని విమర్శించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడిన భాషపై కూడా కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ కఠినంగా ప్రశ్నిస్తుందని, హామీల అమలు జరగకపోతే ప్రజల ముందుంచుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
