WI vs SA: సెంచరీతో దుమ్ములేపిన డికాక్.. KKR పై సానుభూతి.. ట్రెండింగ్‌లో ముంబై ఇండియన్స్

WI vs SA: సెంచరీతో దుమ్ములేపిన డికాక్.. KKR పై సానుభూతి.. ట్రెండింగ్‌లో ముంబై ఇండియన్స్

సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ టాప్ ఫామ్ కొనసాగుతోంది. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి మళ్ళీ అడుగుపెట్టిన ఈ సఫారీ ఓపెనర్ రీ ఎంట్రీలోనూ దుమ్ములేపుతున్నాడు. గురువారం (జనవరి 29) వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో సెంచరీతో చెలరేగాడు. సెంచూరియన్ వేదికగా సూపర్‌స్పోర్ట్ పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తనదైన స్టయిలిష్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 49 బంతుల్లో 115 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. డి కాక్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లతో పాటు 10 సిక్సర్లున్నాయి. 

222 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే మార్కరం వికెట్ కోల్పోయింది. ఈ దశలో డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రికెల్ టన్ సహకారంతో పరుగుల పారించాడు. డికాక్ ఇన్నింగ్స్ తో 17.3 ఓవర్లలోనే సౌతాఫ్రికా 222 పరుగుల టార్గెట్ పూర్తి చేసింది. ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోతుంది. ఎందుకంటే ఐపీఎల్ 2026 మినీ వేలంలో డికాక్ ను ఎవరూ పట్టించుకోలేదు. గత సీజన్ లో విఫలం కావడంతో ఏ ఫ్రాంచైజీ ఈ సఫారీ ఓపెనర్ ను తీసుకోవడానికి ముందుకు రాలేదు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం డికాక్ ను బేస్ ప్రెస్ రూ.1 కోటి రూపాయలకు తీసుకుంది.

Also Read : పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్

అంతకముందు మినీ ఆక్షన్ ముందు డికాక్ ను కోల్ కతా జట్టు రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ లో డికాక్ బ్యాటింగ్ లో పూర్తిగా నిరాశపరిచాడు. ఒక్క ఇన్నింగ్స్ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. దీంతో కేకేఆర్ ఆ సఫారీ ఆటగాడిని రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ టాప్ ఫామ్ లో ఉన్నాడు. డికాక్ సూపర్ ఫామ్ లో ఉండడం ముంబైకి కలిసొచ్చింది. సోషల్ మీడియాలో తమ ప్లేయర్ బాగా ఆడుతున్నాడని ముంబై ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు డికాక్ ను రిలీజ్ చేసిన కేకేఆర్ పై సానుభూతి చూపిస్తున్నారు.     

2025 అక్టోబర్ లో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన డికాక్ అద్భుతంగా రాణించాడు. గత ఏడాది చివర్లో ఇండియాతో జరిగిన టీ20 సిరీస్ లో దుమ్ములేపాడు. చండీఘర్ వేదికగా జరిగిన రెండో టీ20లో కేవలం 46 బంతుల్లో 90 పరుగులు చేసి తన మార్క్ చూపించాడు. ఇదే సిరీస్ లో చివరి మ్యాచ్ లో 35 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇదే సూపర్ ఫామ్ ను డికాక్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో చూపించాడు. 12 మ్యాచ్ ల్లో 390 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.