న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా టీ20 వరల్డ్ కప్‌కు వెళ్లబోమని హెచ్చరించి వెనక్కి తగ్గిన పాకిస్తాన్.. మరో కుటిల ప్రయత్నానికి తెరతీసే ప్రయత్నం చేస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండియాతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించనున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల అటు ఐసీసీ, ఇటు బీసీసీఐని ఒకేసారి దెబ్బతీయొచ్చని భావిస్తోంది. దీనివల్ల తమకు రెండు పాయింట్లు చేజారినా.. ఐసీసీ, బీసీసీఐకి విపరీతమైన నష్టం వస్తుందని అంచనా వేస్తోంది. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలపై నిరసన తెలియజేయడానికి ఇదే మంచి మార్గమని పీసీబీ వర్గాలు అంటున్నాయి.
ఇదే విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్లు కూడా అంగీకరిస్తున్నారు. ‘మేం ఇండియాతో మ్యాచ్ ఆడబోమని చెబితే ఐసీసీ అంగీకరించాల్సిందే. ఒకవేళ గవర్నింగ్ బాడీ ఒప్పుకోకపోతే అసలైన ఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. మేం గ్రూప్ స్టేజ్ గురించే మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్‌కు చేరితే మాత్రం సమస్య మరోలా ఉంటుంది. కచ్చితంగా ఫైనల్‌కు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తాం. నిరసనల్లో భాగంగానే దీన్ని చేసి చూపిస్తాం’ అని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు.
