- కేంద్రమంత్రి కుమార స్వామికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో పామ్ చెట్లపై ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తిదారులను ప్రోత్సహించేందుకు జాతీయ పామ్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. బుధవారం కర్నాటక మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, మాజీ లోక్ సభ సభ్యులు ఉమేశ్ జాదవ్, జేడీఎస్ నాయకులు బాల్ రాజ్ గుత్తేదార్, వీకే గౌడ, ఆల్ ఇండియా గౌడ ప్రతినిధులు జీకే పాటిల్ తదితరులతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామితో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పామ్ చెట్లకు సంబంధించిన పలు విజ్ఞప్తులను కేంద్ర మంత్రికి అందజేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణలోని నీరా పాలసీని దేశవ్యాప్తంగా తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. తాటి, ఈత, కొబ్బరి, జీలుగ, ఖర్జూర తదితర చెట్ల నుంచి తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించి మార్కెటింగ్ కల్పిస్తే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
