- వరదలకు నదీతీరాలు, కాల్వల ఆక్రమణలూ కారణమే...
- వాతావరణ మార్పులతో ఆకస్మిక వరదల ముప్పు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- హైదరాబాద్‌లో ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ వర్క్‌షాప్
హైదరాబాద్, వెలుగు : వరదల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల గుర్తింపు, వరదల నివారణ కోసం ప్రత్యేకంగా ఓ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి డీమార్కేషన్ చేస్తామని వెల్లడించారు.
కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్’ వర్క్‌షాప్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. భద్రాచలంలో గోదావరి నది వరద, ఖమ్మంలో మున్నేరు ముంపు సమస్యలపై నోడల్ ఏజెన్సీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. 2024 సెప్టెంబర్‌లో వచ్చిన వరదలకు మున్నేరు వాగు 36 అడుగుల ఎత్తుతో ప్రవహించిందని, 1984 తర్వాత అంతటి వరద ఇదేనని చెప్పారు. మున్నేరు వరదతో 110 గ్రామాలు మునిగిపోయాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని 29 జిల్లాల్లోనూ వరద ప్రభావం పడిందని, వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయని వివరించారు. 257 వాగులు, వంకలు పొంగిపొర్లి 26,592 పశువులు చనిపోయాయని, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. వరదలకు 29 మంది చనిపోగా.. ఆర్థికంగా రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇలాంటి వరదలతో జనం తీవ్రంగా ప్రభావితమయ్యారన్నారు.
నదులు ఉప్పొంగుతున్నయ్
వర్షాలు ఎక్కువగా ఉన్న సీజన్లలో గోదావరి ప్రతిసారీ పొంగిందని, దీంతో భద్రాచలం వద్ద డేంజర్ మార్క్ దాటి ప్రవహించిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. ఫలితంగా భద్రాచలం – నెల్లిపాక రోడ్‌పై రాకపోకలు కూడా నిలిచిపోయాయన్నారు. ఇటు సుద్దకల్ నది గతేడాది రికార్డు స్థాయిలో 425 మీటర్ల ఎత్తులో ప్రవహించిందన్నారు. అదే ఏడాది మంజీర నది కూడా 344.5 మీటర్ల ఎత్తున ప్రవహించిందన్నారు. మానేరు నది తీరంలోని అంకుశాపూర్, గరిమిల్లపల్లి, సోమనపల్లిలు కూడా 2023లో తీవ్రమైన వరదల బారిన పడ్డాయన్నారు.
కేవలం ప్రకృతి వల్లే కాకుండా.. మనిషి చేస్తున్న తప్పుల వల్ల కూడా వరద ముప్పులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. నదీ మైదానాల ఆక్రమణ, కాలువలు, డ్రైనేజీల కబ్జా వంటి వాటితోనే వరద ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఫ్లడ్ప్లెయిన్ జోనింగ్.. అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాదన్నారు. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్ర ప్రజల తాగునీరు, వ్యవసాయానికి ఆయువు పట్టు అని చెప్పారు.
మరోవైపు క్లైమేట్ ఛేంజ్‌తో కరువులు, వరదలు తీవ్రమవుతున్నాయన్నారు. ఒకప్పుడు వర్షపాత అంచనాలు కరెక్ట్‌గా ఉండేవని, కానీ, ఇప్పుడు ఎప్పుడు వర్షాలు వస్తాయో.. ఎప్పుడు రావో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. పది పదిహేనేండ్లు వరదలు, వర్షాలే రాని ప్రాంతాలూ.. ఇప్పుడు సడన్‌గా వరదలొచ్చి మునిగిపోతున్నాయన్నారు. దానికి వర్షాలొక్కటే కారణం కాదని, నదుల పక్కన ఉన్న స్థలాలను ఆక్రమించడమే అతిపెద్ద సమస్య అని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. .
ప్రతిష్ఠాత్మకంగా మూసీ ప్రక్షాళన
మూసీ ప్రక్షాళనను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మార్చి 13న మూసీ అభివృద్ధి ప్రణాళిక ఫేజ్1ను విడుదల చేశామన్నారు. మూసీ అభివృద్ధిలో సెంట్రల్ వాటర్ కమిషన్ పేర్కొన్న ఫ్లడ్ ప్లెయిన్ జోనింగ్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతామన్నారు. మూసీ నది కొన్ని దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైందని, దీంతో నదికి ఇరువైపులా ఆక్రమణలు పెరిగాయన్నారు. పరిశ్రమల వ్యర్థాలు నదిలోకే వదిలారన్నారు. కాగా, ప్రాజెక్టుల్లో పూడికతీతను కూడా ప్రాధాన్యాంశంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
