- మండలిలో వెలుగు పత్రికలో వచ్చిన వార్తను చదివిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ఈ గడ్డిమందు ఏటా 5 వేల మంది ప్రాణాలు తీస్తున్నదని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న పారాక్వాట్ గడ్డి మందు ప్రజల ప్రాణాలను తీస్తున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో పారాక్వాట్ గడ్డిమందుపై వెలుగు దిన పత్రికలో వచ్చిన వార్తను చదువుతూ..సమస్యను ప్రభుత్వ దృష్టికీ తీసుకెళ్లారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ ప్రమాదకర రసాయనాన్ని తక్షణమే నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ పారాక్వాట్ మందు తాగిన 100 మందిలో 98 మంది చనిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ఎటువంటి విరుగుడు లేదు.
మన రాష్ట్రంలో ఏటా సుమారు 5 వేల మంది ఈ మందు ప్రభావంతో బలవుతున్నారు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం’’ అని పేర్కొన్నారు. కొండగట్టు ప్రాంతానికి చెందిన డాక్టర్లు కూడా ప్రాణనష్టాన్ని వివరిస్తూ తనకు లేఖ రాశారని బల్మూర్ వెంకట్ గుర్తు చేశారు. కేరళలో సంచలనం సృష్టించిన గ్రీష్మ కేసును ఆయన ప్రస్తావించారు. ‘‘స్మెల్ లేని పారాక్వాట్ మందును కూల్ డ్రింక్ లో కలిపి తన ప్రియుడికి ఇచ్చి చంపిన ఘటన అత్యంత దారుణం. పంటలకు వాడాల్సిన మందు ఇలా హత్యలకు ఉపయోగపడటం విచారకరం’’ అని పేర్కొన్నారు. పారాక్వాట్ కేవలం ప్రాణాలు తీయడమే కాకుండా... పర్యావరణానికి కూడా తీరని నష్టం కలిగిస్తోందని బల్మూర్ వెంకట్ తెలిపారు.
పొలాల్లో స్ప్రే చేసే సమయంలో గాలిని పీల్చుకోవడం వల్ల రైతులు, కూలీలకు కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయని.. ఈ ఫెస్టిసైడ్ వాడటం వల్ల భూసారం దెబ్బతిని, నేల నిర్జీవంగా మారుతోందని వివరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), రైతు కమిషన్ కూడా ఈ మందుల నిషేధాన్ని సమర్థిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా దీనిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని బల్మూర్ వెంకట్ కోరారు.
