ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్- టి మండలం డోర్‌పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికను ఎలక్షన్ ట్రిబ్యునల్ రద్దు చేసింది. కాగజ్‌నగర్ ఆర్డీవో(ఎలక్షన్ ట్రిబ్యునల్) లోకేశ్వర్ రావు ఈ మేరకు తీర్పు వెలువరించారు. సర్పంచ్‌గా ఎన్నికైన సోయం సమీరాకు నామినేషన్ సమయంలో ఎన్నికల నిబంధనల ప్రకారం 21 ఏళ్లు పూర్తి కాలేదని ఆమె ప్రత్యర్థి రాస్పల్లి మంగక్క అప్పట్లోనే ఫిర్యాదు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్, సమీరా సమర్పించిన ఎస్సెస్సీ సర్టిఫికెట్, స్కూల్ రికార్డుల ఆధారంగా ఆమె జనన తేదీ 2007 జూన్ 8గా నిర్ధారించింది. అయితే ఆధార్, పాన్, ఓటర్ ఐడీల్లో పుట్టిన తేదీ 2003 జనవరి 1గా ఉండడంతో ఆ ఆధారాలపై పోటీకి దిగినట్లు గుర్తించారు. ఇవి తప్పుడు రికార్డుల ఆధారంగా పొందినవిగా ట్రిబ్యునల్ తేల్చింది.
దీంతో 21 ఏళ్లకు సమీరా వయస్సు తక్కువగా ఉన్నట్లు నిర్ధారించి ఆమె ఎన్నికను చెల్లదని ప్రకటించారు. సర్పంచ్ స్థానం చట్టప్రకారం భర్తీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ట్రిబ్యునల్ సూచించింది. ఈ తీర్పు ఈ నెల 12న వెలువడగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
