కరీంనగర్, వెలుగు: బెల్లం వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేసిన ఆరోపణలపై కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండెటి రామును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయనకు సహకరించిన గవర్నమెంట్ స్కూల్ టీచర్ జక్కని వేణును కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. గుండెటి రాము గతంలో వేములవాడలో సీఐగా పనిచేసే సమయంలో బెల్లం వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేసి, తన స్నేహితుడు జక్కని వేణు బ్యాంక్ ఖాతాలో జమ చేయించేవాడు.
వేణు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నాడు. 2019 నుంచి 2024 ఫిబ్రవరి వరకు పలుమార్లు వేణు ఖాతాలో లంచాల డబ్బులు జమయ్యాయి. అనంతరం రాము తన ఖాతాతో పాటు తన తండ్రి ఖాతాకు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు రాము, వేణుపై చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు నిర్వహించిన సోదాల్లో రాము నివాసంలో లెక్కకు రాని రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేసి కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు
