ముంబై: ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అకాల మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో అజిత్ పవార్ స్థానంలో ఎన్సీపీ నుంచి ఎవరూ కేబినెట్ బెర్త్ దక్కించుకుంటారు..? అజిత్ నిర్వహించిన శాఖలను కూటమి ప్రభుత్వం తిరిగి ఎన్సీపీకే కేటాయిస్తుందా అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ చర్చల నడుమ ఎన్సీపీ కీలక నేతలు శుక్రవారం (జనవరి 30) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే, ఛగన్ భుజ్‌బల్ సీఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాకు వెళ్లి ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చించారు. అలాగే, అజిత్ పవార్ నిర్వహించిన కీలకమైన ఆర్థిక, ఎక్సైజ్, క్రీడా శాఖలను తిరిగి ఎన్సీపీకే కేటాయించాలని కోరారు. ఈ మేరకు సీఎం ఫడ్నవీస్ రాతపూర్వకంగా లేఖ అందించారు.
ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బుధవారం (జనవరి 28) బారామతి ఎయిర్ స్ట్రిప్‌లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదా అకాల మరణంతో ఎన్సీపీ నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది.
ప్రస్తుతం రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌ను బారామతి ఉప ఎన్నికలో బరిలోకి దించాలని ఎన్సీపీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, అజిత్ పవార్ స్థానంలో సునేత్రా పవార్ పేరును ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలని ఎన్సీపీ డిసైడ్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై చర్చించేందుకే ఎన్సీపీ నాయకులు సీఎం ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 1) ఎన్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఎల్పీ సమావేశంలో సునేత్రా పవార్‌ను ఎన్సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నారు.
