న్యూఢిల్లీ: తాను సభకు రావాలన్న విపక్షాల డిమాండ్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం (ఆగస్ట్ 12) పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు రెడీగా ఉందన్నారు. ఈ మేరకు సభా నియమాల ప్రకారం చర్చ కోసం ప్రతిపక్షాలు స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని సూచించారు.
స్పీకర్ అనుమతిస్తే.. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రతి అంశానికి జవాబు చెప్పేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు 24 గంటల పాటు సభలోనే ఉంటానని ఆయన తెలిపారు. అయితే, వివరణాత్మక పార్లమెంటరీ చర్చలో పాల్గొనాలా లేక సభలో గందరగోళం సృష్టించాలా అనేది ప్రతిపక్షం ఇప్పుడు నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు.
నేను ప్రతిరోజు పార్లమెంట్‌కు వస్తున్నా:
నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళన, అయోధ్య విరాళాల చోరీ అంశాలపై సమాధానం చెప్పాల్సి వస్తోందనే భయంతో తాను సభకు రావడం లేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను అమిత్ షా తోసిపుచ్చారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరవుతున్నానని తెలిపారు. అయితే, ప్రతిపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలిగిస్తుండటంతోనే తాను సభకు హాజరు అవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు.
ప్రతిపక్షాలు కావాలనే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ నిరసనకారుల అణచివేతపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పారని స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం ఉందని పునరుద్ఘాటించారు.
