గోల్డ్ సిల్వర్ ఇంకా పెరుగుతాయ్..! రేట్లు తగ్గాలంటే ఆ రెండూ జరగాల్సిందే: ఆర్థిక సర్వే రిపోర్ట్

గోల్డ్ సిల్వర్ ఇంకా పెరుగుతాయ్..! రేట్లు తగ్గాలంటే ఆ రెండూ జరగాల్సిందే: ఆర్థిక సర్వే రిపోర్ట్

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే బంగారం, వెండి ప్రియులకు ఒకవైపు ఆశ్చర్యాన్ని, మరోవైపు ఆందోళనను కలిగించే విషయాలను వెల్లడించింది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు 100 శాతం పెరగ్గా, వెండి ధరలు ఏకంగా 260 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంతటి భారీ ర్యాలీ తర్వాత ధరలు తగ్గుతాయని అంతా భావిస్తున్న వేళ.. గ్లోబల్ అనిశ్చితి కొనసాగితే ఈ ధరల ర్యాలీ ఇప్పుడప్పుడే ఆగేలా లేదని సర్వే పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్స్ గోల్డ్ రేట్లకు రెక్కలు ఇస్తున్నాయని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ 11 శాతం మేర పడిపోవడం వంటి అంశాలు చాలా మంది ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లించాయని.. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొంటూ పోవటం కూడా రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణమని రిపోర్ట్ స్పష్టం చేసింది.

►ALSO READ | ఆర్థిక సర్వే 2026: ఏఐతో టెక్కీలకు కష్టకాలమే.. సామాన్యులకు ఉపయోగపడే AI మోడల్స్ తేవాలె..

బంగారం, వెండి రేట్ల భవిష్యత్తుపై ఆర్థిక సర్వే, వరల్డ్ బ్యాంక్ నివేదికలు అంచనాలను పంచుకున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల గ్లోబల్ కమోడిటీ ధరలు 7 శాతం తగ్గుతాయని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసినప్పటికీ.. బంగారం విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తమైంది. ప్రపంచంలో శాంతి నెలకొని, వాణిజ్య వివాదాలు పరిష్కారమైతే తప్ప బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం లేదని సర్వే కుండబద్దలు కొట్టింది. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి ధరలు స్థిరంగా లేదా పెరుగుతూ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రిపోర్ట్ తేల్చేసింది.

బంగారం, వెండితో పాటు పారిశ్రామిక లోహాలైన రాగి, అల్యూమినియం, ఐరన్ రేట్లు కూడా మోస్తరుగా పెరుగుతాయని సర్వే చెబుతోంది. ముఖ్యంగా కాపర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. గ్రీన్ టెక్నాలజీ, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల రాగి వాడకం విపరీతంగా పెరిగిందని, దీంతో రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉంటాయని పేర్కొంది. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాలు అనుకూలించకపోతే సామాన్యుడికి బంగారం, వెండి అందని ద్రాక్షగానే మిగిలేలా ఉన్నాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది.