ఇండియా కేవలం AIని ఉపయోగించే దేశంగా మాత్రమే ఉండకూడదని.. సొంతంగా ఏఐ పరిష్కారాలను సృష్టించే గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని ఆర్థిక సర్వే 2026 ఆకాంక్షించింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారీ మెగా మోడల్స్ నిర్మించడం కంటే.. సామాన్య ప్రజలకు ఉపయోగపడే అప్లికేషన్ ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే భారత్‌కు శ్రేయస్కరమని స్పష్టం చేసింది. ఇతర దేశాల ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను వాడుకుంటూ పోతే అది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరించింది.
ముందుగా అందరూ భయపడుతోంది ఏఐ కారణంగా టెక్ రంగంపై ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయంపైనే. ఈ విషయంలో టెక్ వైట్ కాలర్ జాబ్స్ తీవ్రంగా ప్రభావితం అవుతాయని.. 2008 ఆర్థిక సంక్షోభం కంటే ఇది ప్రమాదకరంగా ఉండొచ్చని హెచ్చరించింది ఆర్థిక సర్వే 2026. విదేశాల్లో ఏఐ వాడకం పెంచటం వల్ల ఉపాధి అవకాశాలు దేశీయంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. దీనిని ఎదుర్కోవటానికి ఏఐ ఎకనమిక్ కౌన్సిల్ తీసుకురావాలని సర్వే ప్రతిపాదించింది.
Also Read : సూపర్ స్పీడులో ఇండియన్ ఎకానమీ గ్రోత్.. ట్విన్ విన్ బూస్ట్
భారత్ వద్ద ఇప్పటికే ఉన్న శక్తివంతమైన 'డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' అంటే ఆధార్, యూపీఐ, డిజీలాకర్ లాంటి వ్యవస్థలను పునాదిగా చేసుకుని ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయాలని సర్వే సూచించింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా.. మన దేశీయ డేటా, మానవ వనరుల సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ గ్రౌండ్ లెవల్ నుండి సొంత ఏఐ మోడల్స్‌ను నిర్మించాలని నివేదిక పేర్కొంది. ఓపెన్ సోర్స్ వ్యవస్థలు, ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేలా ఉండే టెక్నాలజీ ద్వారానే నిజమైన విలువను సృష్టించగలమని ప్రభుత్వం నమ్ముతోంది.
ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం, తయారీ రంగాల్లో వేగంగా ఫలితాలు ఇచ్చేలా రంగాల వారీగా ఏఐ మోడల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సర్వే సూచించింది. ఉదాహరణకు.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించడానికి లేదా విద్యార్థులకు వ్యక్తిగత బోధన అందించడానికి ఏఐని వినియోగిస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు వేగంగా ఊతాన్నిస్తుంది. కేవలం భారీ హంగుల కోసం కాకుండా.. సామాజిక ప్రయోజనం చేకూర్చే ఏఐపైనే భారత్ పెట్టుబడులు పెట్టాలని సర్వే స్పష్టం చేసింది.
అదే సమయంలో ఏఐ వినియోగం పెరిగే కొద్దీ దానికి తగిన రెగ్యులేటరీ విధానాలు, చట్టాలు కూడా అంతే వేగంగా ఉండాలని సర్వే హెచ్చరించింది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత రూల్స్ తీసుకురావటం కంటే.. అవి అభివృద్ధి చెందుతున్నప్పుడే సమాంతరంగా డేటా సేఫ్టీ అండ్ పాలనపై నిబంధనలు ఉండాలని సూచించింది.
