కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఎకనామిక్ సర్వే 2025-26 నివేదికను సమర్పించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే యూనియన్ బడ్జెట్‌కు ముందు వచ్చిన ఈ అధికారిక నివేదిక భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన "రిపోర్ట్ కార్డ్"గా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో.. భారత్ మాత్రం ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని తాజా సర్వే స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.4% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ నేతృత్వంలో రూపొందించిన ఈ సర్వే అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో(FY27) కూడా ఈ జోరు కొనసాగుతూ వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అధిక వడ్డీ రేట్లు ఉన్నప్పటికీ.. ధరలు అదుపులో ఉంటూ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి బలంగా సాగే "గోల్డిలాక్స్" స్థితిని భారత్ విజయవంతంగా అందుకుందని సర్వే రిపోర్ట్ పేర్కొంది.
ఈసారి సర్వేలో ప్రధానంగా 'ట్విన్ విన్' అంశం హైలైట్ అయ్యింది. ఒకటి 2025 చివరి నాటికి ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4% లక్ష్యం కంటే కిందకు పడిపోవడం కాగా రెండోది దేశీయంగా వినియోగం అనూహ్యంగా పుంజుకోవడం. ఈ రెండు అంశాలు భారత ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థకు గట్టి మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. దీనికి గత బడ్జెట్లో ప్రకటించిన న్యూ టాక్స్ రీజిమ్ కింద పన్ను పరిమితి పెంపులు, జీఎస్టీ తగ్గింపు కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు.
అయితే అంతర్జాతీయ పరిస్థితులపై సర్వే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా కఠినమైన టారిఫ్ విధానాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ దేశీయంగా ఉన్న బలమైన డిమాండ్, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం చేస్తున్న భారీ ఖర్చు ఈ సవాళ్లను అధిగమించడానికి తోడ్పడుతాయని నివేదిక విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సర్వేలోని అంశాల ఆధారంగా రాబోయే బడ్జెట్‌లో ఇన్కమ్ టాక్స్ రాయితీలు, కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు ఉంటాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
