Movie Review: తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా మూవీ రివ్యూ.. ‘స్త్రీ’ అంటే మౌనం కాదు.. శక్తి అని నిరూపించిన కథ..

Movie Review: తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా మూవీ రివ్యూ.. ‘స్త్రీ’ అంటే మౌనం కాదు.. శక్తి అని నిరూపించిన కథ..

2022లో మలయాళంలో విడుదలైన ‘జయజయ జయహే సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. బాసిల్ జోసెఫ్‌, ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్ జంటగా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్ఛర్యపరిచింది. ఆ సూపర్ హిట్ సినిమాకు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). 

ఏఆర్ సజీవ్ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం (2026 జనవరి 30న) తెలుగు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రియల్ లైఫ్‌లో రూమర్డ్ లవర్స్‌గా వైరల్ అవుతున్న తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా జంటగా నటించడంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే సినిమా మొదలుపెట్టిన రోజు నుంచే ప్రమోషన్స్లో ఆకట్టుకుంటూ వస్తున్నారు. మరి భార్యాభర్తలుగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఎంతవరకు ఆకట్టుకున్నారు? సూపర్ హిట్ చిత్రానికి రీమేక్గా వచ్చిన ఈ చిత్ర కథ, కథనం ఏమైనా మార్చి తీశారా? అనే పూర్తి వివరాలు రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్) ఒక కోపిష్టి, అహంకార స్వభావం కలిగిన వ్యక్తి. చేపల చెరువుల వ్యాపారం చేస్తూ ఉండే అతనికి తన మాటే చట్టం. మరోవైపు, గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన శాంతి (ఈషా రెబ్బా) చిన్ననాటి నుంచే స్త్రీ వివక్షను ఎదుర్కొంటూ పెరుగుతుంది. ఇంట్లో, కాలేజీలో, బయట అన్ని చోట్లా వివక్షను ఫేస్ చేస్తూ జీవిస్తుంది. జీవితంలో ఎలాంటి స్వేచ్ఛ లేని శాంతి, తన కలలను పక్కనపెట్టి ఓంకార్ నాయుడిని పెళ్లి చేసుకుంటుంది.

పెళ్లయ్యాక కూడా శాంతికి భర్త నుంచి ప్రేమ, ఆప్యాయత లభించదు. ఫస్ట్ నైట్‌కే దూరంగా ఉండే స్థితి. ఓంకార్ నాయుడిది పూర్తిగా డామినేటింగ్ మైండ్‌సెట్. ఇంట్లో ఏదైనా తనకు నచ్చినట్టుగానే జరగాలి, లేదంటే కోపం వస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, పెళ్లాం అంటే.. కాలి కింద చెప్పు లెక్క చూస్తడు. చిన్న విషయానికే చేయి చేసుకోవడం అతగానికి అలవాటు. 

ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? ఒకానొక దశలో సహనం నశించి, తన భర్త అహంకారాన్ని ఆమె ఎలా అణిచి వేసింది ? అందుకు ఓంకార్‌కు శాంతి ఇచ్చిన షాక్ ఏంటి? అనే తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ థియేటర్లలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

‘కలకత్తాలో చేపలని జలపుష్పాలు అంటారండీ.. మీ పుష్పాలు నా చెవిలో యెట్టకండి’ అంటూ గోదావరి యాసలో తరుణ్‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌ చెప్పిన డైలాగ్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి.  చూడ్డానికి మంచోడిలా ఉన్నా డిఫరెంట్‌‌‌‌ మైండ్‌‌‌‌సెట్‌‌‌‌తో భార్యను ఇబ్బంది పెట్టే పాత్రలో కనిపించాడు. అలాంటి భర్తకు బుద్ధి చెప్పేందుకు ఆ భార్యామణి ఏం చేసిందనేది మూవీ మెయిన్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌.

‘‘గోదారోళ్లకు వెటకారాలు సూట్ అయినట్టు ప్రతీకారాలు సూటవ్వవురా.. హీరోకు తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌కు ఎక్కువలా తయారయ్యాడు’’ అంటూ కీలకపాత్రలో కనిపించిన బ్రహ్మాజీ తనదైన స్టైల్‌‌‌‌లో చెప్పిన డైలాగ్స్‌‌‌‌ హిలేరియస్‌‌‌‌గా పేలాయి.

‘ఇది రీమేక్ అయినా యూనివర్సల్‌‌‌‌గా అందరికీ  కనెక్ట్ అయ్యే స్టోరీ. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో పాత్రల్లో చాలా మార్పులు చేశారు. ఇందులో ఉండే ఎమోషన్స్ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు రీమేక్ అనే ఫీలింగ్ రాదు. ఇందులో అన్ని క్యారెక్టర్స్‌‌‌‌కి ఆడియెన్స్ రిలేట్ అవుతారు. మొత్తానికి, ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఒరిజినల్ కథకు న్యాయం చేస్తూనే, రీమేక్ అన్న భావన రాకుండా తెలుగు టచ్‌తో తెరకెక్కిన చిత్రం అని చెప్పవచ్చు.

నటీనటుల నటన విశ్లేషణ:

ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ పూర్తిగా లీనమయ్యాడు. కోపిష్టి, అహంకారంతో కూడిన డామినేటింగ్ భర్త పాత్రను ఆయన చాలా సహజంగా నటించాడు. ముఖ్యంగా భార్యపై పెత్తనం చూపించే సన్నివేశాల్లో అతని బాడీ లాంగ్వేజ్, కళ్లలో కనిపించే అగ్రెషన్ పాత్రకు బాగా సూట్ అయ్యాయి. ఓ వైపు దర్శకుడిగా, ఇప్పుడు నటుడిగా రాణించండంలో సక్సెస్ అయ్యాడు. 

ALSO READ :  ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ 'దురంధర్'..

ఈషా రెబ్బా శాంతి పాత్రలో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మౌనంగా బాధపడే భార్యగా మొదలై, క్రమంగా తనలోని ధైర్యాన్ని బయటకు తీసుకొచ్చే మహిళగా మారే జర్నీని ఈషా చాలా సున్నితంగా చూపించింది. ముఖ్యంగా సహనం, బాధ, ఆవేదన, ఆత్మగౌరవం వంటి అన్ని రకాల భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ నటించింది. ఈ సినిమాతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు దక్కే అవకాశముంది. మిగతా క్యారెక్టర్స్ తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు 

టెక్నికల్ అంశాలు:

రీమేక్ సినిమాలకు ఉండే ప్రధాన సవాల్‌ను డైరెక్టర్ ఏఆర్ సజీవ్ చాలా వరకు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒరిజినల్ కథలోని కోర్ ఎమోషన్‌ను నిలబెట్టుకుంటూనే, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సన్నివేశాల టోన్‌ను మార్చారు. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్. జే క్రిష్ అందించిన సంగీతం & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.