బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి

బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
  • లంకపల్లి అడవుల్లో 30 కిలోల ఐఈడీల నిర్వీర్యం

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గడ్​లో జరిగిన ఎన్​కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. 30 కిలోల రెండు ఐఈడీలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ-, చత్తీస్​గఢ్​ సరిహద్దు ఏరియాలో మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కూంబింగ్​కు డీఆర్​జీ బలగాలను బస్తర్​ఐజీ సుందర్​రాజ్​ఆదేశించారు. 

గురువారం బీజాపూర్​జిల్లా పామేడు అడవుల్లో కూంబింగ్​చేస్తుండగా భద్రతాబలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల డెడ్ బాడీలను, ఏకే-47, 9ఎంఎం పిస్టోల్, భారీగా పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసరాలు లభించాయి. 

మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్​కొనసాగి స్తున్నామని బస్తర్​ఐజీ సుందర్​రాజ్​తెలిపారు. ఇదే జిల్లాలోని లంకపల్లి అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా భద్రతాబలగాలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. మావోయిస్టులు అమర్చిన 30 కిలోల బరువైన రెండు ఐఈడీలను గుర్తించి, బాంబు స్క్వాడ్​తో నిర్వీర్యం చేశారు.  

అదేవిధంగా కాంకేర్​జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతాబలగాలు భగ్నం చేశాయి. మోదెమర్కా నదీ వెంట మావోయిస్టులు 9 ఐఈడీలను అమర్చారు. గస్తీకి వెళ్లిన భద్రతాబలగాలకు భూమిలో వైర్లు కన్పించాయి. అలర్ట్ అయి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.  డీఆర్ జీ, బీఎస్ఎఫ్​జవాన్లకు రక్షణగా బాంబ్ డిస్ప్యూజ్​స్వ్కాడ్​ను పంపించారు. 

వరుసగా 9 చోట్ల అమర్చిన ఐఈడీలతో పాటు, వైర్లు గుర్తించి వెలికితీసి నిర్వీర్యం చేశారు. అదే ప్రాంతంలో 2024లో వివిధ ఎన్​కౌంటర్లలో 29 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. ప్రతీకారేచ్చతో మావోయిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 25 మందితో కూడిన మావోయిస్టుల దళం సంచరిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తూ గస్తీని ముమ్మరం చేశారు.