బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాచలం/ గుండాల, వెలుగు: సమన్వయంతో పని చేసి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ రెవెన్యూ, పోలీసు, దేవస్థానం, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్​కలెక్టర్ ఆఫీస్​లో శ్రీరామనవమి ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల్లో వీఐపీలు, పర్యాటకులకు, భక్తులకు అన్నిరకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. తాగునీరు, ఆహారం, వైద్య సేవలపై ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్​ నియంత్రణ, ఆర్టీసీ సర్వీసులు, కరెంట్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టంగా చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్​రాజ్​ తెలిపారు. సెక్టార్ వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో పాల్గొనే సిబ్బందికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు. తర్వాత మిథిలాస్టేడియంలో ఏర్పాట్లను వారు తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్​ అంకిత్​ గుండాల మండలం ముత్తాపురం ఏకలవ్య స్కూల్​ను సందర్శించారు. స్కూల్​లో శుభ్రత లేకపోవడంతో సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు.