నాకు నయనతార కావాలి.. స్టాలిన్ నా కోరిక తీరుస్తారా? ఎంపీ షణ్ముగం వ్యాఖ్యలపై భగ్గుమన్న డీఎంకే.!

నాకు నయనతార కావాలి.. స్టాలిన్ నా కోరిక తీరుస్తారా? ఎంపీ షణ్ముగం వ్యాఖ్యలపై భగ్గుమన్న డీఎంకే.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది.  ఒకవైపు అధికార డీఎంకే (DMK), మరోవైపు ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ఏఐఏడీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సి.వి. షణ్ముగం సినీ నటి నయనతారపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మహిళా భద్రతపై ఆందోళనలు చేస్తున్న సమయంలోనే ఒక మహిళా నటిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారాయి.

అసలేం జరిగింది?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మీ కలలు మాకు చెప్పండి" (Tell us your dream) అనే కార్యక్రమాన్ని విమర్శించే క్రమంలో షణ్ముగం హీరోయిన నయనతారపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథాకాలపై ప్రజల ఫీడ్ బ్యాక్, వారి కోరికలను తెలుసుకుంటారు. విల్లుపురంలో జరిగిన నిరసన ప్రదర్శనలో షణ్ముగం మాట్లాడుతూ.. "నాకు నయనతార కావాలి, స్టాలిన్ నా కోరిక తీరుస్తారా? నయనతారను పెళ్లి చేసుకోవాలన్న ఒకరి కలను ముఖ్యమంత్రి నెరవేర్చగలరా?" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

భగ్గుమన్న డీఎంకే

మహిళల భద్రత కోసం ర్యాలీ నిర్వహిస్తూ, ఒక మహిళా నటిని ఇలా కించపరచడంపై డీఎంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాజకీయ విమర్శలు చేయండి, కానీ మహిళలను వల్గర్‌గా చూపకండి అంటూ డీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా సీరియస్ అయ్యారు. నయనతారను అవమానించడం అంటే మహిళా లోకాన్ని అవమానించడమే అని మండిపడ్డారు.  షణ్ముగం ఒక రిపీట్ అఫెండర్ అని, గతంలో కూడా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు మరో నేత శరవణన్ అన్నాదురై దుయ్యబట్టారు.  ధైర్యముంటే షణ్ముగంపై చర్యలు తీసుకోవాలని ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి సవాల్ విసిరారు.

 

వివాదాల షణ్ముగం

సి.వి. షణ్ముగం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా స్టాలిన్ ఎన్నికల హామీలను విమర్శిస్తూ.. "ముఖ్యమంత్రి రేపు ఉచితంగా భార్యలను కూడా ఇస్తామని ప్రకటిస్తారు" అంటూ నోరు పారేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు నయనతారపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మరోసారి విమర్శల పాలవుతున్నారు.

►ALSO READ | సినీ నటి రేణు దేశాయ్‎ సోషల్ మీడియా వేధింపుల కేసులో ఇద్దరు అరెస్ట్

ఎన్నికల హీట్..

తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా భద్రత, శాంతిభద్రతల అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది.  తమ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని, పాత గణాంకాలతో పోలిస్తే నేరాలు తగ్గాయని సీఎం స్టాలిన్ సర్కార్ చెబుతోంది. అటు రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు పెరిగాయని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.మహిళా భద్రతపై పోరాటం చేస్తున్నామని చెబుతున్న పార్టీ నేతలే ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఈ వివాదం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.