లెంజడరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు అంటే ప్రేమ కథలు, అద్భుతమైన సంగీతం ఉంటాయి. అయితే ఆయన తదుపరి చిత్రం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రానికి సంగీతం అందించేది ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ మూవీకి పనిచేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇది ఏఆర్ రెహమాన్ అభిమానులను కాస్త నిరాశ పరిచింది. అయితే ఈ అనుమాలన్నింటినీ పటాపంచలు చేస్తూ లేటెస్ట్ అప్డే్ట్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
మళ్ళీ కలిసిన 'రోజా' కాంబినేషన్!
మణిరత్నం తన తదుపరి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం మళ్లీ తన ఆస్థాన సంగీత విద్వాంసుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌నే ఎంచుకున్నారు. 1992లో 'రోజా' చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం మూడు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇది వీరిద్దరి కలయికలో రాబోతున్న 19వ చిత్రం కావడం విశేషం. వీరిద్దరూ కలిస్తే చార్ట్‌బస్టర్ ఆల్బమ్ గ్యారెంటీ అని సినీ ప్రియులు నమ్ముతుంటారు. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన పాటను కూడా రెహమాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
విజయ్ సేతుపతి - సాయి పల్లవి క్రేజీ కాంబో!
ఈ సినిమా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. విజయ్ సేతుపతికి మణిరత్నంతో ఇది రెండో సినిమా. గతంలో వీరిద్దరూ 'చెక్క చివంద వానమ్' (తెలుగులో నవాబ్) కోసం కలిసి పనిచేశారు. మణిరత్నం గారితో పనిచేయడం ఒక గొప్ప అనుభవమని, ఆయన ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయని, వాటిని అర్థం చేసుకోవడం ఒక సవాలుతో కూడిన పని అని సరదాగా విజయ్ సేతుపతి వ్యాఖ్యానించారు. ఇక సాయి పల్లవి సహజమైన నటన, మణిరత్నం మార్కు మేకింగ్ తోడైతే వెండితెరపై మ్యాజిక్ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
►ALSO READ | కావాలంటే వేరే పాటలు పెట్టుకోండి: ప్రభుత్వ పాఠశాల్లలో విజయ్ సాంగ్స్ బ్యాన్..?
షూటింగ్ ఎప్పుడు?
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ 'మద్రాస్ టాకీస్' నిర్మిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జూలై నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మణిరత్నం సినిమాలు సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఈ చిత్రానికి కూడా ఆయన రెగ్యులర్ టీమ్ పని చేయనుంది. రెహమాన్ మ్యూజిక్, మణిరత్నం విజువల్స్, విజయ్ సేతుపతి-సాయి పల్లవిల ఫర్ఫార్మెన్స్.. ఈ కాంబినేషన్ వింటుంటేనే సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి ఈ క్లాసిక్ కాంబో ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
