చెన్నై: ఎన్నికల వేళ ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్విజయ్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. విజయ్ సినిమా పాటలను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రసారం చేయకుండా స్టాలిన్ సర్కార్ నిషేధించినట్లు తెలుస్తోంది. తమిళ దిన పత్రిక దినమలర్ ఈ విషయాన్ని నివేదించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ఫేర్వెల్, ఫ్రెషర్స్ పార్టీ వంటి వేడుకల్లో విజయ్ సినిమా పాటలు ప్లే చేయొద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు ఈ వార్త సారాంశం.
విజయ్ సాంగ్స్‌కు బదులుగా వేరే పాటలు పెట్టుకోవాలని విద్యార్థులకు సూచించినట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఇష్యూ వైరల్‌గా మారింది. దీంతో స్టాలిన్ సర్కార్‌పై విజయ్ ఫ్యాన్స్, టీవీకే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే విజయ్ను నేరుగా రాజకీయాల్లో ఎదుర్కొవాలని అంతేకానీ ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ఏంటని మండిపడుతున్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విజయ్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. కరూర్ తొక్కిసలాట, ఆ తర్వాత సీబీఐ విచారణతో విజయ్ చిక్కుల్లో పడ్డాడు. ఇదిలా ఉండగానే.. విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది.
ఈ వ్యవహారం కొనసాగుతుండగానే వ్యక్తిగతంగా విజయ్‌కు భారీ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా విజయ్ ఓ నటితో అక్రమ సంబంధ పెట్టుకున్నాడని ఆమె ఆరోపణలు చేయడంతో విజయ్ క్యారెక్టర్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. ఇలా వివాదాలన్ని చుట్టుముట్టిన వేళ విజయ్ పాటలపై ప్రభుత్వం నిషేధించడంతో గమనార్హం.
2026, ఏప్రిల్ 23 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. విజయ్ నేత్రుత్వంలోని టీవీకే పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. తమిళనాడులో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న బీజేపీ విజయ్‌తో పొత్తు కోసం పాకులాడుతోంది. కానీ ఇందుకు విజయ్ ఒప్పుకోవడం లేదని టాక్. ఒంటరిగా పోటీ చేసేందుకు విజయ్ మొగ్గు చూపుతున్నట్లు టీవీకే పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే. దీంతో ఈసారి తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి, టీవీకే మధ్య పోటీ నెలకొంది.
