టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ విరమణపై ఇరాన్ నయా సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. యుద్ధం విరమించే సమస్యే లేదని తేల్చి చెప్పారు. శాంతి చర్చలకు ఇది సరైన సమయం కాదని.. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. దుందుడుకు చర్యలకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్‌లను మోకరింపజేస్తానని శపథం చేశారు. ఆ రెండు దేశాలు ఓటమిని అంగీకరించి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ తీసుకునే ప్రతీకారం చాలా కఠినంగా, తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డాడని కోమాలోకి వెళ్లాడని అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో తన తండ్రి అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోజ్తాబా ఖమేనీ తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి బహిరంగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇరాన్ వైఖరిని మోజ్తాబా స్పష్టంగా చెప్పారు.
యుద్ధం ఆపే సమస్యే లేదని.. అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు ఉండవని కుండబద్దలు కొట్టారు. శాంతి చర్చలకు ఇది సరైన సమయం కాదన్నారు. ఇరాన్‌పై దాడులకు పాల్పడిన అమెరికా, ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇరాన్ కు జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలన్నారు.
►ALSO READ | ఈ పోరాటానికి హ్యాట్సాఫ్: అబ్బాయిగా పుట్టి.. అమ్మాయిగా మారి.. ఇప్పుడు ఎంపీగా గెలిచి..!
ముడి చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి మూసే ఉంటుందన్నారు. గల్ఫ్ కంట్రీస్ అమెరికా సైనిక స్థావరాలను ఆలస్యం చేయకుండా మూసివేయాలని లేదంటే అవి మా ప్రత్యక్ష లక్ష్యాలుగా మారవచ్చని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారం చాలా కఠినంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మోజ్తాబా వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తేటతెల్లమైంది.
