ఈ పోరాటానికి హ్యాట్సాఫ్: అబ్బాయిగా పుట్టి.. అమ్మాయిగా మారి.. ఇప్పుడు ఎంపీగా గెలిచి..!

ఈ పోరాటానికి హ్యాట్సాఫ్: అబ్బాయిగా పుట్టి.. అమ్మాయిగా మారి.. ఇప్పుడు ఎంపీగా గెలిచి..!

ట్రాన్స్ జెండర్ శ్రేష్ట శర్మ. ప్రస్తుతం ఈ పేరు నేపాల్‎లో మోరు మోగిపోతుంది. ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. అబ్బాయిగా పుట్టి.. అమ్మాయిగా మారి.. ఇప్పుడు ఏకంగా ఎంపీగా గెలిచారు. దీంతో నేపాల్ ఫెడరల్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‎గా రికార్డ్ సృష్టించారు. అయితే.. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులు, ఈసడింపులు, పడ్డ కష్టం గురించి తెలుసుకుని మీ పోరాటానికి హ్యాట్సాప్ అంటోంది యావత్ నేపాల్. మరీ పక్క దేశంలో పాపులర్‎గా మారిన శ్రేష్ట శర్మ గురించి మనం కూడా తెలుసుకుందాం..

ట్రాన్స్ జెండర్లు అంటే కొందరికి చిన్నచూపు.. వారిని ఎగతాళి చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటివి చేస్తుంటారు. వాళ్లేమి చేస్తారులే అని చిన్నచూపు చూస్తారు.. కానీ శ్రేష్ట శర్మ మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఈసడింపులు, వేధింపులు, విమర్శలు, దూషణలు ఎన్ని ఎదురైన ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. విమర్శలు, అవమానాలనే మెట్లుగా మల్చుకుంటూ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. 

మహిళలకే సరైన ప్రాధాన్యం లేని రాజకీయ రంగాన్ని ఆమె ఎంచుకున్నారు. పురుష ఆధిపత్యం ఉండే పాలిటిక్స్‎లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) నుంచి పోటీ ఘన విజయం సాధించారు. తద్వారా నేపాల్ ఫెడరల్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‎గా రికార్డ్ సృష్టించారు. 

 కైలాష్ శ్రేష్ట పుట్టి భూమిక శ్రేష్టగా మారి..  

శ్రేష్ట శర్మ కాఠ్మండులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పుట్టుకతో ఆమె అబ్బాయి. పేరు కైలాష్ శ్రేష్ఠ. పెరిగి పెద్ద అవుతోన్న కొద్ది ఆమె తనలోని శారీరక మార్పులను గుర్తించారు. తనకు అమ్మాయిలకు కలిగే భావాలు ఉన్నాయని తన తల్లికి చెప్పారు. ఇంట్లో కూడా ఆమె భావాలను అంగీకరించారు. కానీ బయట సమాజంలో మాత్రం శ్రేష్ట ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొన్నారు. 

►ALSO READ | ఇరాన్ నెంబర్ 2 లారిజానీని చంపేశామన్న ఇజ్రాయెల్ : లేదు లేదు ఆయన బతికే ఉన్నాడన్న ఇరాన్

పదకొండేళ్ల వయసు వచ్చేసరికి ఆమె తన ప్రవర్తన, స్వరం, నడక కారణంగా పాఠశాలలో వేధింపులను ఎదుర్కొంది. తోటి విద్యార్థులు ఆమెను దూషిస్తూ, పదేపదే వేధించేవారు. దీంతో ప్రైవేట్ పాఠశాల నుంచి పాఠశాలకు మారింది. కానీ అక్కడ కూడా ఇవే వేధింపులు.. ఇవే వెక్కిరింతలు. లింగ విభజన వల్ల స్కూల్‎లో కాలకృత్యాలు తీర్చుకోవడంలో చాలా ఇబ్బందులు. అబ్బాయిల టాయిలెట్లకు ఆమె వెళ్లలేదు.

 అమ్మాయిల టాయిలెట్లలోకి వెళ్లడానికి అనుమతించలేదు. ఈ సమస్యను అధిగమించడానికి ఏకంగా పాఠశాల వేళల్లో నీళ్లు తాగడం మానేసింది. రోజు రోజుకు పాఠశాల, సమాజంలో వేధింపులు తీవ్రం కావడం, ఇదే సమయంలో తండ్రి చనిపోవడంతో మాధ్యమిక విద్యను పూర్తి చేయకుండానే స్కూల్ స్కూల్ మానేసింది. ఆ తర్వాత పింకీ గురుంగ్‌తో సహా బ్లూ డైమండ్ సొసైటీ (BDS) కార్యకర్తలతో సంబంధం శ్రేష్ట జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 

ఈ అనుబంధం ద్వారా ఆమెకు తన సముహం, తన గుర్తింపుపై స్పష్టత లభించాయి. దీంతో ఆమె భూమిక అనే పేరును స్వీకరించారు. 2007 నాటి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పుకు అనుగుణంగా శ్రేష్ట వర్మ తనను తాను మూడవ లింగం మార్చుకున్నారు. 2021లో తన గుర్తింపును స్త్రీగా ప్రతిబింబించేలా తన పౌరసత్వాన్ని నవీకరించుకున్నారు.

 తను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, ప్రస్తుతం సమాజంలో ట్రాన్స్ జెండర్లపై వివక్షను చూసి చెలించిపోయిన శ్రేష్ట.. వివిధ సంస్థలతో కలిసి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గౌరవం, హక్కుల కోసం పోరాడారు. బాల్యంలో తాను అనుభవించిన మానసిక క్షోభను నివారించే లక్ష్యంతో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ గుర్తింపు ద్వారా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.

 గత ఏడాది సెప్టెంబరులో అవినీతి వ్యతిరేక నిరసనలు నేపాల్ ప్రభుత్వాన్ని కూలగొట్టాయి. దీంతో 2026 మార్చిలో నేపాల్ పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ నుంచి పోటీ చేసి శ్రేష్ట శర్మ విజయం సాధించారు. 

తద్వారా నేపాల్ ఫెడరల్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‎గా రికార్డ్ సృష్టించారు. శ్రేష్ట శర్మ ఎన్నికపై ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆమె పోరాట పటిమను మెచ్చుకుంటున్నారు. శ్రేష్ట శర్మ ఎన్నిక చారిత్రాత్మకమైనదని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అభివర్ణించింది.