వాషింగ్టన్: ఇరాన్‌తో భీకర యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా యూఎస్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ జోసెఫ్ కెంట్ మంగళవారం (మార్చి 17) తన పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు. రాజీనామా లేఖలో కెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని.. కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ ఈ యుద్ధం ప్రారంభించారని ఆరోపించారు. ఈ కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
‘‘జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ పదవికి రాజీనామా చేశా. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి నేను మనస్సాక్షిగా మద్దతు ఇవ్వలేను. ఇరాన్ మన దేశానికి ఎలాంటి తక్షణ ముప్పును కలిగించలేదు. ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగానే అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా’’ అని రాజీనామా లేఖలో కెంట్ కీలక విషయాలు ప్రస్తావించారు.
►ALSO READ | చర్చలు లేవు.. శాంతి లేదు.. నువ్వో నేనో చూస్కుందాం అంటున్న ఇరాన్..!
మధ్యప్రాచ్యంలోని యుద్ధాలు అమెరికన్ల ప్రాణాలను, వనరులను హరించివేస్తాయని గతంలోనే ట్రంప్ గుర్తించారన్నారు. కానీ ఇరాన్‌తో యుద్ధం దిశగా అమెరికాను నెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని కొందరు ట్రంప్‌ను ప్రభావితం చేసి యుద్ధానికి ఉసిగొల్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
