Hindustan Copper: ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల చూపు అంతా మెటల్ స్టాక్స్‌పైనే ఉంది. ముఖ్యంగా 'రాగి' ధరలు ఆకాశాన్ని తాకటంతో.. ఇది రాబోయే రోజుల్లో మరో బంగారం, వెండిలా మారబోతోందా అనే చర్చ మొదలైంది. జనవరి 29న మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ.. నిఫ్టీ మెటల్ సూచీ మాత్రం 2 శాతానికి పైగా లాభపడి 12,359 పాయింట్ల సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ మెటల్ ర్యాలీలో అన్నింటికంటే ఎక్కువగా హిందుస్థాన్ కాపర్ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కేవలం 3 రోజుల్లోనే ఈ షేరు 40 శాతానికి పైగా పెరిగింది. ఇన్వెస్టర్లు డబ్బును కుప్పలు కుప్పలుగా మెటల్ స్టాక్స్ మరీ ముఖ్యంగా కాపర్ షేర్లలోకి తీసుకురావటం దీనికి కారణంగా నిపుణులు అంటున్నారు.
హిందుస్థాన్ కాపర్ షేరు గురువారం ఇంట్రాడేలో 18 శాతం లాభపడి రూ.745 వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. ఏప్రిల్‌లో కేవలం రూ.183 వద్ద ఉన్న ఒక్కో షేరు.. గడచిన 9 నెలల్లో ఏకంగా 305 శాతం లాభపడింది. మధ్యప్రదేశ్‌లోని భాగ్మారి-ఖిర్ఖోరి రాగి గని వేలంలో హిందుస్థాన్ కాపర్ అత్యధిక ధరను కోట్ చేసి 'ప్రిఫర్డ్ బిడ్డర్'గా నిలవడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం. దీనికి తోడు 2025లో రాగి ధరలు అంతర్జాతీయంగా 60 శాతం మేర పెరగడం ఈ కంపెనీకి కలిసి వచ్చింది. ఒకప్పుడు రాగిని కేవలం పారిశ్రామిక అవసరాలకే చూసేవారు. కానీ ఇప్పుడు దీనిని ఒక విలువైన పెట్టుబడిగా, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధంగా ఇన్వెస్టర్లు వాడుకునేందుకు ప్రయత్నించటం రేట్ల ర్యాలీకి దారితీసింది.
మరోవైపు బంగారం, వెండి ధరలు కూడా సరికొత్త చరిత్రను సృష్టించాయి. MCX స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. లక్ష 80వేల 779కి చేరగా.. కిలో వెండి ధర రూ. 4లక్షల 07వేల 456 వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. సాధారణంగా బంగారం ధరలు పెరిగినప్పుడు ఇతర లోహాల ధరలు కూడా ప్రభావితమవుతాయి. అదే క్రమంలో రాగి ధర కూడా ఇప్పుడు బంగారం బాటలోనే పయనిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో రాగికి ఉన్న డిమాండ్, ఐఐపి డేటాలో మైనింగ్ రంగం చూపిన 7.8 శాతం వృద్ధి మెటల్ స్టాక్స్‌కు బూస్ట్‌నిచ్చాయి.
హిందుస్థాన్ కాపర్‌తో పాటు నాల్కో, జిందాల్ స్టీల్, వేదాంత, టాటా స్టీల్ వంటి సంస్థలు కూడా 2 నుంచి 4 శాతం లాభాలను గడించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం, త్వరలో రాబోయే బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, తయారీ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు అందుతాయనే అంచనాలు మెటల్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగంలో రాగి వాడకం విపరీతంగా పెరగనుండటంతో.. కాపర్ ధరలు భవిష్యత్తులో వెండితో పోటీ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అంటున్నారు.
